Share News

Sajjala: వైసీపీ నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

ABN , Publish Date - Oct 16 , 2024 | 12:45 PM

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు.

Sajjala: వైసీపీ నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు దూకుడు పెంచారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గురువారం ఉదయం 10:30గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. విచారణ నిమిత్తం మంగిళగిరి పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులో తెలిపారు. 2021 అక్టోబర్ 19న అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయిన ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్మిచర్, కార్లు, అద్దాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను విచారించగా.. తాజాగా సజ్జలకు నోటీసులు ఇచ్చారు.


మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సన్నిహితుడు చైతన్య సోమవారం రోజున మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం విజయం సాధించిన నాటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. అయితే తాజాగా అతను కోర్టులో లొంగిపోయారు. అలాగే సోమవారం నాడు వైసీపీ నేతలు అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలసిల రఘురామ్‌ను మంగళగిరి పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. దాడి సమయంలో తీసిన ఫొటోలను చూపించి పలు ప్రశ్నలు సంధించారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కేసు విచారణ పూర్తిగా సీఐడీ చేతికి వెళ్లే వరకూ మంగిళగిరి పోలీసులు దర్యాప్తు చేస్తారు.

Updated Date - Oct 16 , 2024 | 01:02 PM