Minister Satya Prasad: వారికి కఠిన శిక్షలు తప్పవు.. మంత్రి సత్యప్రసాద్ వార్నింగ్
ABN , Publish Date - Dec 03 , 2024 | 07:28 PM
కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.
అమరావతి: భూ దందాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. భూదందాలపై ఉక్కు పాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చామని గుర్తుచేశారు. జగన్ రెడ్డి అరాచకపాలనలో వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ అని మండిపడ్డారు. భూ దందాలపై కూటమి ప్రభుత్వానికి దాదాపు 10 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.
ఫ్రీ హోల్డ్ పేరిట జగన్ ప్రభుత్వం భూములను దోచుకుందని రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసైన్డ్ భూములు, చుక్కలు భూములపై రీ వెరిఫికేషన్ చేస్తున్నామన్నారు. 22ఏ కింద ఉన్న భూములను 6 లక్షల ఎకరాలును గత ప్రభుత్వం తీసి అమ్ముకుందని వెల్లడించారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు సామాన్య వర్గాల అసైండ్ భూములను బెదిరించి లాక్కున్నారన్నారు.
రీ వెరిఫికేషన్..
ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని.. రాష్ట్రంలో వీటన్నింటిపై ప్రభుత్వం రీ వెరిఫికేషన్ చేపట్టిందన్నారు. గత సీఎం క్రిమినల్ మైండ్‌తో భూ అక్రమాలు జరిగాయని.. అవన్నీ వెలికి తీస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
న్యాయం చేస్తాం..
విశాఖలో ఇటువంటి కుంభకోణాలు భారీగానే జరిగాయని.. దీనిపై సీఎంతో చర్చించి సభా సంఘాన్ని లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అణగాని సత్యప్రసాద్ అన్నారు. సభ్యుల డిమాండ్ మేరకు భూముల సమస్యలపై కమిటీలు వేసి న్యాయం చేస్తామన్నారు.
విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు చేయాలి: యనమల రామకృష్ణుడు
వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా - కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం రవాణాతో తీవ్ర నష్టం జరిగిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లితే విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు చేయాలని తెలిపారు. విచారణలో జాప్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలు అదే ఆశిస్తున్నారని యనమల రామకృష్ణుడు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Payyavula: మా వియ్యంకులు చేసేది ఆ వ్యాపారం మాత్రమే
TDP MLA: ‘చెవిరెడ్డి’ చేసింది తప్పుకాదా.. ప్రతిఒక్కరూ ఆలోచించండి
CM Chandrababu: ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. వాటికి ఆమోదం
Read Latest AP News And Telugu News