Minister Kollu Ravindra: జగన్ ప్రభుత్వంలో ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి దోచుకున్నారు
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:14 PM
జగన్ కల్తీ మద్యం కారణంగా 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో సతమతమవుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ షాపుల్లోనే ఎమ్మార్పీ ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా 2019-24మధ్య అక్రమ మద్యం రవాణా కేసులు ఎందుకు నమోదయ్యాయని నిలదీశారు.
అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధన దాహంతో ఏపీని పిప్పి చేశాడని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గు చేటని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి మద్యాన్ని దోచుకోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈరోజు(శనివారం) టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... ఎస్ఈబీ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా చేసుకోవడం నిజం కాదా అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వంలో కల్తీ మద్యంతో కిడ్నీ, లివర్ సమస్యలు...
మద్యం తయారీ నుంచి రిటైల్ అమ్మకాల వరకు అన్ని వ్యవస్థలను జగన్ గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వ షాపుల పేరుతో దోచుకున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో కల్తీ మద్యం కారణంగా 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో సతమతమయ్యారని అన్నారు. ప్రభుత్వ షాపుల్లోనే ఎమ్మార్పీ ధరపై ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా 2019-24మధ్య అక్రమ మద్యం రవాణా కేసులు ఎందుకు నమోదయ్యాయని నిలదీశారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు నీతులు చెప్పడానికి సిగ్గు పడాలని అన్నారు.
మద్యంపై కొత్త పాలసీ..
‘‘ఏపీతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో ఎందుకు అంతా ఆదాయం తేడా వచ్చిందో సమాధానం చెప్పగలరా. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గించి.. నీ ప్యాలస్ ఆదాయం పెంచుకోవడం నిజం కాదా? పొరుగు రాష్ట్రాల్లో ఉన్న, దేశ వ్యాప్తంగా ఉన్న మద్యాన్ని ఏపీలో అందుబాటులో ఉంచేలా పాలసీ తీసుకొచ్చాం. రూ.99కే క్వార్టర్ మద్యం అందించే ప్రయత్నం చేస్తున్నాం. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ వేసి ధరలను నిర్ణయించబోతున్నాం.నీతులు చెబుతున్న జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జరిగిన మద్యం అక్రమాలపై చర్చకు సిద్ధమా? త్వరలోనే కల్లు గీత కార్మికులకు కేటాయించిన షాపులకు త్వరలోనే దరఖాస్తులు పిలుస్తాం. కూటమి ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా మద్యం షాపులా కేటాయింపు జరిగింది. ప్రభుత్వంపై నమ్మకంతో 89,882మంది దరఖాస్తు చేసుకున్నారు. షాపులు ఏర్పాటు చేశారు. రీహాబిలిటేషన్ కోసం అదనంగా 2% సెస్ అమలు చేస్తున్నాం’’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు...
‘‘ఆదాయం పోయిందనే బాధతో జగన్ రెడ్డి దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకోరు అని గుర్తుంచుకోండి. ఇసుక మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని దోచుకున్న ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది. జగన్ రెడ్డి ఇసుక మాఫీయా కారణంగా 70మంది భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి కోట్లకు పైగా ప్రజా ధనాన్ని జగన్ బినామీ కంపెనీలతో దిగమింగారు. మీ అక్రమ తవ్వకాల కారణంగానే ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించింది, ఉన్నతాధికారులకు చీవాట్లు పెట్టడం నిజం కాదా? రాష్ట్రంలో 130 ఇసుక రీచులు ఎందుకు మూతబడ్డాయో సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాగానే జూలై 8న ఉచిత ఇసుక పాలసీని ప్రకటించాం. ’’ అని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
విలువలు వదిలేసి రాజకీయం చేసిన జగన్ రెడ్డి
‘‘అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలకు ఎన్జీటీ అడ్డుకోవడం వాస్తవం కదా? ఐదేళ్ల పాలనలో ఏ రోజైనా అందుబాటులో ఉన్న ఇసుక వివరాలు బయట పెట్టారా? విలువలు వదిలేసి రాజకీయం చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చి ఎవరైనా ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాం. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకువెళ్లవచ్చని నిర్ణయించాం.8 జిల్లాల్లో డీ సిల్టిలేషన్ కోసం అనుమతులు ఇచ్చి ఇసుక అందుబాటులో ఉంచాం. ఓపెన్ టెండర్లపై కూడా జగన్ రెడ్డి విమర్శలు చేయడం సిగ్గు చేటు. ఐదేళ్లు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం. సీనరేజి వసూళ్లను కూడా ఉపసంహరించుకున్నాం. పారదర్శకత అంటే ఏంటో జగన్ రెడ్డికి కనీసం తెలుసా? వ్యవస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని రావణ కాస్టం చేసిన జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారు.మద్యాన్ని పొరుగు రాష్ట్రాలకు తరలించినా, బ్లాక్ మార్కెట్ సృష్టించినా తీవ్ర చర్యలు ఉంటాయని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి’’ అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.