Minister Satyaprasad: జగన్ లాగా చేయడం ఎవరికి సాధ్యం కాదు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ విసుర్లు
ABN , Publish Date - Dec 09 , 2024 | 01:29 PM
వైసైీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేతకాని తనం వల్లే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాలు ఘోరంగా పడిపోయాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువ నేత నారా లోకేష్ అహర్నిషలు కష్టపడి దారిలో పెడుతుంటే చూసి సహించలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు.
అమరావతి: వైసీపీ హయాంలో విద్యార్థులు, ఉపాధ్యాయులపై మోయలేని భారాన్ని పెట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ కన్నా మహానటుడు ఎవరున్నారుని ప్రశ్నించారు. పదే పదే అబద్దాలు చెప్పడంతోపాటు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి కూడా ప్రజా రక్షకుడిగా ఫోజు పెట్టడం జగన్ లాగా ఎవరికైనా సాధ్యమవుతుందా అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అరాచకపాలన సాగించి ఇప్పుడేమో ఏమీ జరగక్కున్నా మొసలి కన్నీరు కార్చడం ఆయనకు మాత్రమే సరిపోతుందని ఎద్దేవా చేశారు.
విద్యా వ్యవస్థను దారిలో పెట్టి రాష్ర్టాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు చేస్తున్న శ్రమను జగన్ నటన అంటుంటే ప్రజలంతా ఆయనను ఛీదరించుకుంటున్నారని అన్నారు. ఆయన చేతకాని తనం వల్లే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాలు ఘోరంగా పడిపోయాయని చెప్పారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువ నేత నారా లోకేష్ అహర్నిషలు కష్టపడి దారిలో పెడుతుంటే చూసి సహించలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నటించడం మానేసి కూటమి ప్రభుత్వం మాదిరిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం జగన్ రెడ్డి నేర్చుకోవాలని అన్నారు. లేకుంటే ఇప్పటికి లెవెన్ రెడ్డిగా ఉన్న పెద్ద జీరో రెడ్డిగా మారిపోతావు...తస్మాస్ జాగ్రత అని హెచ్చరించారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేశారు: మంత్రి కింజరాపు అచ్చెనాయుడు
పార్వతీపురం మన్యం జిల్లా: గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ఆరోపించారు. మన్యం జిల్లాలో అచ్చెనాయుడు ఇవాళ(సోమవారం) పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కింజరాపు అచ్చెనాయుడు పాల్గొన్నారు. నరిసిపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహనికి పూల మాల వేసి కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెనాయుడు మీడియాతో మాట్లాడుతూ...విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీటి, సాగునీటిపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అధికారుల సమీక్షాలో మంత్రి అచ్చెనాయుడు కీలక సూచనలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది కానీ సేవలు అందించేందుకు అధికారులు కరువయ్యారని అన్నారు. గిరిశికర గ్రామాలకు రానున్న రెండు సంవత్సరాల్లో కనీసం అంబులెన్స్‌లు వెళ్లేందుకు రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో సమీక్ష చేసిన చిల్లిగవ్వ నిధులు లేవని అన్నారు. నిధులు వచ్చే విధంగా కార్యచరణ చేపెడతామని మంత్రి కింజరాపు అచ్చెనాయుడు పేర్కొన్నారు.