Nadendla Manohar: కేంద్రమంత్రులను కలిసిన నాదెండ్ల మనోహర్.. కారణమిదే..?
ABN , Publish Date - Aug 08 , 2024 | 05:43 PM
ఢిల్లీలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గురువారం నాడు కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినతి పత్రం అందజేశారు.
అమరావతి: ఢిల్లీలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గురువారం నాడు కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి కందిపప్పు కేటాయింపులు చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.
పెండింగ్ నిధులపై..
ఏపీలో ప్రస్తుతం ఉన్న ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కవరేజీ కాకుండా లబ్ధిదారుల కవరేజీని మరింత పెంచాలని అడిగారు. రాష్ట్రంలో మరో 8 ప్రెస్ రిపోర్టింగ్ కేంద్రాలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణకు రూ.532 కోట్ల ఇందుకు సంబంధించిన నిధులను కేటాయించాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1187 కోట్ల పెండింగ్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 11 సీ గోడౌన్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఈ అంశాలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
దీపం కనెక్షన్ల గురించి..
ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరిని మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 60 లక్షల దీపం కనెక్షన్లను పీఎమ్‌యూవై పథకం కింద వచ్చే విధంగా మార్పిడి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖను కేంద్రమంత్రికి అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలించి, చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఏపీకి విభజన వల్ల నష్టం..
దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత ఎక్కువగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏపీలో కిలో కందిపప్పు రూ.150లకు అందిస్తున్నామని అన్నారు. లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పు కేటాయించాలని.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కోరామని తెలిపారు. ధాన్యం నిల్వ, గిడ్డంగుల నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో సింహభాగం ఇవ్వాలని కోరామని చెప్పారు. 1.47 లక్షల రేషన్ కార్డులకు రేషన్ అందిస్తున్నామని వివరించారు. కేంద్ర రాష్ట్ర మార్కెటింగ్ శాఖలు నిర్వహించే ప్రైస్ మానిటరింగ్ సెంటర్లను ప్రస్తుతం ఉన్న 5 నుంచి 13కు పెంచాలని కోరామన్నారు. అలాగే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్డీప్ సింగ్ పూరీని కలిశానని చెప్పారు. ఉజ్వల స్కిమ్‌లో ఏపీకి నష్టం జరుగుతుందని కేంద్రమంత్రికి తెలిపానని అన్నారు. ఏపీకి విభజన వల్ల నష్టం జరిగిందని.. న్యాయం చేయాలన్న భావన కేంద్ర పెద్దల్లో కనిపిస్తుందని అన్నారు. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు తెలిపేందుకు ఎంపీలు, అధికారులు వారి సహకారాన్ని అందించారని వివరించారు. రాష్ట్ర అంశాల పరిష్కారానికి కేంద్రం సుముఖంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
కందిపప్పు కొరతపై..
కందిపప్పు ఇతర దేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంటుందని అన్నారు. నవంబర్ నాటికి కందిపప్పు సమస్య పరిష్కరిస్తామని కేంద్రమంత్రి తెలిపారన్నారు. కందిపప్పు సమస్య తాత్కాలికంగా వచ్చిందని.. రైతులు పంట పండిస్తే ధాన్యం కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. రైతుల నుంచి పంట సేకరించి డబ్బు ఇవ్వలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
డోర్ డెలివరీ రేషన్‌పై చర్చిస్తాం..
పెండింగ్‌లో ఉన్న రూ. 1674 కోట్లను రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.1000 కోట్లు ఇచ్చామన్నారు. సోమవారం మరో రూ. 674 కోట్లను చెల్లించబోతున్నామని వెల్లడించారు. డోర్ డెలివరీ రేషన్ అంటూ రూ.1800 కోట్లు జగన్ ప్రభుత్వం వృథా చేసిందని ధ్వజమెత్తారు. డోర్ డెలివరీ రేషన్‌పై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అర్హత ఉన్నవారికి రేషన్ కార్డులు ఇస్తాం.. టార్గెట్ అంటూ ఏమి లేదని స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా అక్రమ తరలింపు చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
వైసీపీపై మంత్రి నాదెండ్ల ధ్వజం..
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇంటింటికీ రూ.4 వేల పెన్షన్ ఇచ్చినందుకా..? పోలవరం పనులు మొదలు పెడుతున్నందుకా..? కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సహకారం తీసుకువచ్చినందుకా..? అని నిలదీశారు. జగన్ కోటల్లో ఉంటారు..ప్రజలు ఎలా ఉంటున్నారో తెలుసా ..? అని అడిగారు. జగన్ ప్రజల పక్షాన నిలబడాలి..ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. శాంతి భద్రతలు లేవని రాష్ట్రపతి పాలన పెట్టాలని అనడం సరికాదని అన్నారు. వైసీపీకి ఎలక్షన్ కమిషన్‌లో సభ్యత్వం లేని పార్టీ అని విమర్శించారు. ముందు జగన్ పార్టీని చక్కదిద్దుకోవాలని సూచించారు. వైసీపీ పార్టీ ఎవరిదో క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఏపీలో సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.