RoJa: అదానీ స్కాం.. వైఎస్ షర్మిలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:05 PM
అదానీతో కలిపి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్కాం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అయితే ఈ విషయంపై షర్మిలకు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: అదానీతో కలిపి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్కాం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అయితే ఈ విషయంపై షర్మిలకు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ వైఎస్ షర్మిల.. మీకు తెలుగు అర్థం కాదా.. ఇంగ్లీష్ అర్థం కాదా.. నిన్న మీ అన్న రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్ మీద బురద జల్లుతున్నారు’’ అని మాజీమంత్రి రోజా ఆరోపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
జగన్ ప్రభుత్వం పరుగులు తీయలేదు..
‘‘సెకీ 2021లో మే నెలలో ఎక్కడ వేలం వేసింది.. 2.14 పైసలకు ఎక్కడ అమ్మిందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. అదానీ వద్ద గుజరాత్ కరెంటు కొనలేదు. గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్‌లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయి. అదానీతో ఒప్పందం చేసుకుంటామని జగన్ ప్రభుత్వం ఏమీ పరుగులు తీయలేదు. 2021, సెప్టెంబరు 15న కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ, మనకు అంతకు ముందు టెండర్లలో వచ్చిన అత్యల్ప ఆఫర్.. అంటే రూ. 2.49కే తమ మార్జిన్‌తో సహా విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఆ లేఖలో వెల్లడించిన విషయం మీకు తెలియదా.. గుజరాత్, రాజస్థాన్‌లో కానీ, సోలార్ పవర్ రూ.1.99కి కానీ, రూ.2.10 కానీ వచ్చినా అది ఏపీకి ట్రాన్స్‌పోర్టు చేసే సరికే ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జ్ మరో రూ.1.98 కూడా పడుతుంది. అప్పుడు యూనిట్ ధర డబుల్ అవుతుందని... ఈ విషయం మీకు తెలియదా.. సెకీ మనకు ఇన్సెంటివ్‌గా, ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జెస్ (ఐఎస్‌టీఎస్) మాఫీ అని చెప్పడం కారణంగా యూనిట్ రూ.2.49లకే వస్తోంది’’ అని రోజా అన్నారు.
ఆ రేట్లు వర్తిస్తున్నాయి..
‘‘గుజరాత్‌లో యూనిట్ రూ.1.99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు. ఎక్కడ కన్జూమ్ చేస్తున్నారన్నది చూస్తే మాన్యుఫాక్చరింగ్ టేకింగ్ ప్లేస్ గుజరాత్.. అమ్మే డిస్కంలు.. మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ కొనే వాళ్లు. అక్కడే మాన్యుఫాక్చర్ చేసి అక్కడే కొంటున్నారు. కాబట్టే వాళ్లకు ఆ రేట్లు వర్తిస్తున్నాయని... ఈ మాత్రం కూడా షర్మిలకు తెలియదా.. ఇదే సెకీ, ఇదే ఆత్మ నిర్భర్ ప్రాజెక్టు కింద తమిళనాడుకు, ఒడిశాకు, ఛత్తీస్‌గఢ్‌కు కూడా రూ.2.61కి అమ్మింది. విద్యుత్ ధర కూడా 12 పైసలు తగ్గింది. వాస్తవాలను దాచి మీరు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్‌పై చేసుకున్న ఒప్పందాలు చూస్తే కళ్లు తిరుగుతాయి. పవన విద్యుత్ పీపీఏలు చూస్తే.. 2014–19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. రూ.4.84 నుంచి రూ.4.83వరకు. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్‌కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఎలు చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ.6.49కి కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. 2015లో రూ.5.96కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం, 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50కి కొనుగోలు చేశారు. సోలార్ ఎనర్జీని యావరేజ్‌గా రూ.5.90కి కొనుగోలు చేశారు. మరి మా ప్రభుత్వం యూనిట్ రూ.2.49కు కొంటే అది పెద్ద తప్పా. అది పెద్ద నేరమా. చంద్రబాబు యూనిట్ రూ.5.90లకు కొంటే మంచివారు.. జగన్ రూ.2.49లకు కొంటే చెడ్డవాడా.. ఇదెక్కడి న్యాయం. మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న వాదనాలు, మీరు వేస్తున్న ఎత్తుగడలు, మీరు చేస్తున్న విమర్శలు, వీటన్నింటి లక్ష్యం జగన్. మీరు కోరుకుంటున్నది ఆయన పతనం. మీరు ఎన్ని కోరుకున్నా ఆయనకు ప్రజలు అండగా ఉంటారు’’ అని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు..