AP Politics: ఆ ఒక్క కారణంతోనే షర్మిలకు ఏపీసీసీ పగ్గాలు: సజ్జల
ABN , Publish Date - Jan 25 , 2024 | 03:34 PM
పీ రాజకీయాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)కు అవగాహన లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు.
అమరావతి: ఏపీ రాజకీయాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)కు అవగాహన లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు. గురువారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో షర్మిల కోసం పనిచేసిన వాళ్లకు ఏం న్యాయం చేశారు? అని ప్రశ్నించారు. గతంలో జగన్ ఓదార్పు యాత్రను అణచివేయాలని... కాంగ్రెస్ ప్రయత్నించింది నిజం కాదా? అని నిలదీశారు. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించలేదా.. ఇది షర్మిలకు కనపడలేదా అని ప్రశ్నించారు.
షర్మిల.. జగన్ నుంచి ఏం ఆశించారు
వైఎస్సార్ ఆశయాలు నెరవేరలేదని షర్మిల అంటున్నారన్నారు. వైఎస్సార్ కూతురు, జగన్ చెల్లి అనే ఆ ఒక్క కారణంతోనే.. కాంగ్రెస్ షర్మిలకు ఏపీసీసీ బాధ్యతలు అప్పజెప్పిందని తెలిపారు. బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి వైసీపీపై షర్మిల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను తిట్టిన షర్మిల.. ఇప్పుడు అదే పార్టీలో ఎలా చేరారని నిలదీశారు. షర్మిలకు అన్యాయం జరిగి ఉంటే.. ఏమి ఆశించి జగన్ కోసం తిరిగారో చెప్పాలన్నారు. షర్మిల ప్రతి వ్యాఖ్యకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యసభ మూడు స్థానాలు వైసీపీకే వస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.