YS Sharmila: ఆరోగ్య శ్రీపై అనుమానాలు కలిగించొద్దు.. ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి
ABN , Publish Date - Jul 30 , 2024 | 10:21 PM
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోగ్య శ్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం ప్రజలకు అనుమానాలు కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోగ్య శ్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం ప్రజలకు అనుమానాలు కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు సకాలంలో మెరుగైన వైద్యం అందించేలా కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్(X) వేదికగా షర్మిల ఓ ట్వీట్ చేశారు.
షర్మిల పోస్ట్ యథాతధంగా...
‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీపై మీ స్పందనకు ధన్యవాదాలు. నేను ప్రజలను పక్క దారి పట్టించడానికి మాట్లాడి ఉంటే మిమల్ని సమాధానం చెప్పమని ఎందుకు అడుగుతాను ? మీ పత్రిక సమావేశంతో ప్రజలకు అనుమానాలు తలెత్తాయి. అవి మా దృష్టికి రావడంతో నేను స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వమని అడగటం జరిగింది. పెమ్మసాని గారు.. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నేతగా.. ‘‘ఆరోగ్య శ్రీకి డబ్బులు లేవు, ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు. పేషంట్లకు వైద్యం అందడం లేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ కార్డులు తీసుకోండి” అని మీరే ఆరోగ్యశ్రీ పథకం కొనసాగింపుపై అనుమానాలు కలిగించడం ఎంత వరకు సమంజసం ? ప్రభుత్వాన్ని నడిపే వాళ్లే బాధ్యతారాహిత్యమైన కామెంట్స్ చేయొచ్చా ? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీని, అనారోగ్యశ్రీ చేయకుండా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తూ.. పథకాన్ని ఆటంకాలు రాకుండా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఎన్నికల్లో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని మీ NDA కూటమి ఎన్నికల హామీ ఇచ్చింది. ఇది ఎప్పటిలోగా అమలు చేస్తారో కూడా ప్రజలకు వివరించాలి’’ అని ప్రభుత్వాన్ని షర్మిల అడిగారు.