Share News

YSRCP Attack: కంచికచర్ల ఘటన మరవక ముందే.. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:39 AM

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో టీడీపీ నేతలపై దాడి ఘటన జరిగిన రోజు వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో శుక్రవారం తెల్లవారుజాము సమయంలో అరాచకం సృష్టించారు. తెలుగు యువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పంటించారు.

YSRCP Attack: కంచికచర్ల ఘటన మరవక ముందే.. పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

పల్నాడు: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్రంలో వైసీపీ(YSRCP) మూకలు రెచ్చిపోతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, అభిమానులే లక్ష్యంగా వరస దాడులకు తెగబడుతూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెలరేగిన గొడవలు దృష్టిలో పెట్టుకుని అదును చూసి దాడులు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమపై దాడులు చేసినా ఎన్డీయే ప్రభుత్వం మాత్రం కక్షపూరితంగా వ్యవరించదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు. కూటమి పార్టీల నేతలు ఎవరూ వైసీపీ శ్రేణలపై దాడులు చేయెుద్దని ఆదేశాలు జారీ చేశారు. వారి ఆజ్ఞ మేరకు కూటమి కార్యకర్తలు, అభిమానులు చాలా సంయమనంతో ఉంటున్నారు. అయినప్పటికీ వైసీపీ మూకలు కూటమి నేతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ వరస దాడులకు తెగబడుతున్నారు.


కారుకు నిప్పంటించి..

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో టీడీపీ నేతలపై దాడి ఘటన జరిగిన రోజు వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో శుక్రవారం తెల్లవారుజాము సమయంలో అరాచకం సృష్టించారు. తెలుగు యువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పంటించారు. అర్ధరాత్రి కావడం, ఇంటి ముందు ఎవరూ లేకపోవడంతో పక్కా పథకం ప్రకారం తగలబెట్టారు. మంటలు రావడంతో అప్రమత్తమైన గ్రామస్థులు.. పోక వెంకట్రావు కుటుంబాన్ని అప్రమత్తం చేశారు. దీంతో స్థానికులంతా కలిసి మంటలు అదుపు చేశారు. అనంతరం వైసీపీ నేతలే ఘటనకు పాల్పడ్డారంటూ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు తగలబెట్టిన ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై బాలకృష్ణ దర్యాప్తు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది.


కీసర ఘటన మరవక ముందే..

కంచికచర్ల మండలం కీసర గ్రామంలో బుధవారం అర్ధరాత్రి టీడీపీ నాయకులు తాము ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం చేశారు. తిరిగి వారివారి ఇళ్లకు వెళ్తుండగా.. వైసీపీ శ్రేణులు దారి కాచి దాడి చేశారు. దాడిలో టీడీపీ నేత యర్రగోర్ల విజయ్‌, రాయల గోపి తీవ్రంగా గాయపడగా కారు సైతం ధ్వంసమైంది. అదే సమయంలో పోలీసులు అక్కడే ఉండటంతో పెద్దఎత్తున ఘర్షణ చెలరేగకుండా నివారించగలిగారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిచ్చిన ఫిర్యాదుపై వైసీపీకి చెందిన 10మందిపై కేసు నమోదైంది.


వైసీపీకి చెందిన పరిటాల రామకోటేశ్వరరావు, పరిటాల మల్లిఖార్జునరావు, సింఖా సాంబయ్యతోపాటు ఎనిమిది మందిని గురువారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని నందిగామ కోర్టులో హాజరుపరిచారు. కీసర గ్రామంలో అలజడులు తలెత్తకుండా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి ఉందని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన పాత గొడవల కారణంగా ప్రస్తుతం దాడి జరిగినట్లు ఆయన తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

YSRCP: గుడ్‌బై చెబుతున్న నేతలు.. జగన్ దారెటు..

Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు

Tirupati Laddu: తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంపై స్పందించిన రమణదీక్షితులు

Updated Date - Sep 20 , 2024 | 11:40 AM