Share News

AP Elections: బస్సులు పెడ్తున్నం.. బయల్దేరండి.. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ఓటర్లకు ఫోన్లు!

ABN , Publish Date - May 05 , 2024 | 01:08 PM

‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్‌ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్‌కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయి..

AP Elections: బస్సులు పెడ్తున్నం.. బయల్దేరండి.. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ఓటర్లకు ఫోన్లు!

- వరుస సెలవుల నేపథ్యంలో ఓటర్లు రెడీ

- పిల్లాపాపలతో వెళ్లేందుకు సన్నద్ధం

- నియోజకవర్గానికి కనీసం 20 బస్సులు కావాలని డిమాండ్‌

- ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు

- ఓటర్ల రవాణాకే 200 కోట్ల వ్యయం?

హైదరాబాద్‌ సిటీ: ‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్‌ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్‌కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలను అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీల కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏపీలో ఓటు హక్కు ఉండి ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏ ఒక్కరినీ అభ్యర్థులు వదిలిపెట్టడం లేదు. ప్రతి ఓటరుకు అభ్యర్థుల తరఫున స్థానిక నేతలు ఫోన్‌చేసి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల కంటే హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఏపీ ఓటర్లు ఉండడంతో వారిని రప్పించడంపైనే అభ్యర్థులంతా ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల వారీగా ఓటరు లిస్టుల్లో పేర్లున్న వారిని ఏకం చేసి వారిని రప్పించేందుకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం(Krishna, Guntur, Prakasam) జిల్లాలకు వెళ్లే ఓటర్లకు ఒక్కో బస్సుకు ఆర్టీసీ రూ.80వేల చొప్పున వసూలు చేస్తుండగా, ప్రైవేటు బస్సులకు రూ.1.20 లక్షలు ఇవ్వాలని ఆపరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ ఓట్లన్నీ పక్కాగా పడేవే కనుక ఆయా నియోజకవర్గాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతైనా ఖర్చుచేసేందుకు వెనుకాడడం లేదని సమాచారం. గత ఎన్నికలప్పటికంటే.. ఇపుడు చాలామందికి సొంతవాహనాలు ఉన్నాయి. సొంత వాహనాల్లేని వారికి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

city6.jpg

ఇధికూడా చదవండి: Tulasi Reddy: జగన్ ఓటమి తధ్యం

ఆర్టీసీ అధికారులను సంప్రదించిన పార్టీలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లున్న హైదరాబాద్‌వాసులను ఆయా నియోజకవర్గాలకు తరలించడానికి అభ్యర్థులు సుమారు రూ.200కోట్లకుపైగా ఖర్చుపెట్టేందుకు సన్నద్ధమైనట్లు అంచనా. ఈ నెల 11 నుంచి 13 (శని, ఆది, సోమవారం) వరకు సెలవులు రావడంతో పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా నియోజకవర్గాలకు చేరుకునేందుకు ఓటర్లు రెడీ అయినట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి దాదాపు ప్రతి నియోజకవర్గానికి కనీసం 20 బస్సులు కావాల్సి వస్తోందని అనుకుంటున్నారు. ఉమ్మడి కడప, అనంతపురం, చిత్తూరు(Kadapa, Anantapur, Chittoor) జిల్లాల వాసులు హైదరాబాద్‌లో తక్కువగా ఉంటారు. ఆ మూడు ఉమ్మడి జిల్లాలను మినహాయిస్తే, మిగిలిన 10 ఉమ్మడి జిల్లాలకు బస్సులు ఏర్పాటు చేసేందుకు ఒక్కో పార్టీకి రూ.100 కోట్ల చొప్పున రెండు ప్రధాన పార్టీలకు రూ.200 కోట్లకుపైనే ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌(Kukatpally, Serilingampally, Kuthbullapur), మేడ్చల్‌ ప్రాంతాల్లోని ఓటర్ల కోసం బస్సులు కావాలని ఏపీలోని ప్రధాన పార్టీల నేతలు టీఎ్‌సఆర్టీసీ అధికారులను సంప్రదించారు. అయితే, తమ వద్ద హైదరాబాద్‌ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి(Vijayawada, Guntur, Rajahmundry), ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం.. తదితర దూరప్రాంతాలకు నడపగలిగే 500 బస్సులు మాత్రమే ఉంటాయని గ్రేటర్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో మరిన్ని బస్సులను బుక్‌ చేసేందుకు ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా సంక్రాంతి, దసరా పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లే మాదిరిగానే, ఈ దఫా ఓట్ల పండుగకు సొంతూరికి వెళ్లేందుకు హైదరాబాద్‌లోని ఏపీ ఓటర్లు సన్నద్ధమవుతున్నారు. ఆయా పండుగలకు సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్లిరాగా, ఓట్ల పండుగకు మాత్రం ఉచితంగా వెళ్లివచ్చే చాన్స్‌ లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: AP Elections: మొబైల్ ఫోన్లతో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఓటర్లు.. పోలీసుల వైఫల్యం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 05 , 2024 | 01:40 PM