Share News

Kadapa: నాలుగో రోజూ నోరు మెదపని ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి..

ABN , Publish Date - Dec 13 , 2024 | 08:45 PM

ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి విచారణలో సరైన సమాధానాలు చెప్పడం లేదంటూ పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. రాఘవరెడ్డిని నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. నాలుగు రోజులపాటు జరిగిన విచారణలో రాఘవరెడ్డి సమాధానాలు దాట వేసే ధోరణిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.

Kadapa: నాలుగో రోజూ నోరు మెదపని ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి..

కడప: ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి విచారణలో సరైన సమాధానాలు చెప్పడం లేదంటూ పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. రాఘవరెడ్డిని నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. నాలుగు రోజులపాటు జరిగిన విచారణలో రాఘవరెడ్డి సమాధానాలు దాట వేసే ధోరణిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. అడిగిన ఏ ప్రశ్నకూ సరైన సమాధానాలు చెప్పడం లేదని, ప్రతి ప్రశ్నకూ రాఘవరెడ్డి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని వెల్లడించారు. తమ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పేవరకూ విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ వెల్లడించారు. విచారణ ముగిసే వరకూ రాఘవరెడ్డి కచ్చితంగా హాజరు కావాల్సిందే ఆయన స్పష్టం చేశారు. విచారణకు సహరించకపోతే చట్టప్రకారం అరెస్టు చేస్తామని డీఎస్పీ మురళీ నాయక్ చెప్పారు.


కాగా, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా విచారణ చేస్తున్న పొంతన లేని సమాధానాలు చెప్తూ పోలీసుల సహనాన్ని రాఘవరెడ్డి పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. మూడో రోజు (గురువారం) 9 గంటల పాటు విచారించినా మాజీ సీఎం జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి, సోదరి షర్మిల, నర్రెడ్డి సునీతలపై పెట్టించిన పోస్టుల గురించి సరైన సమాధానాలు ఇవ్వలేదు. రెండో రోజు విచారణకు హాజరైన రాఘవరెడ్డి.. అడిగిన ప్రశ్నలకు తనకేమీ తెలియదనే సమాధానమే ఇచ్చారు. విజయలక్ష్మి, షర్మిలపై రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్‌తోనే సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టానని వర్రా రవీంద్రారెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో రాఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు కడప సైబర్‌ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నారు. అయితే వర్రా రవీంద్రరెడ్డి ఎవరో తనకు తెలియదని రాఘవరెడ్డి దాట వేసే ప్రయత్నం చేస్తున్నారు.


మంగళవారం రోజు విచారణలో 20 రోజుల క్రితం తన సెల్‌ఫోన్‌ పోయిందని, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇతర సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌ తనకు తెలియదని రాఘవరెడ్డి చెప్పారు. ఆ రోజు దాదాపు 10 గంటల పాటు విచారణ సాగింది. అయినా సరైన సమాధానాలు చెప్పలేదు. మీరు ఇచ్చిన కంటెంట్‌నే పోస్టు చేశానంటూ వర్రా రవీంద్రరెడ్డి స్టేట్మెంట్‌ ఇచ్చారని, అందుకు డబ్బులు కూడా ఇచ్చారట కదా అని పోలీసులు ప్రశ్నించగా.. అసలు వర్రా ఎవరో తెలియదని, అతనితో మాట్లాడలేదని సమాధానం ఇచ్చారు. అయితే షర్మిలపై అసభ్య పోస్టులు పెట్టిన తర్వాత ఒక్కో పోస్టుకు రూ.13,500 చొప్పున వర్రాకు నగదు చెల్లించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వాటిపై ప్రశ్నించగా తనకేమీ తెలియదనే రాఘవరెడ్డి సమాధానం ఇచ్చారు. మరోవైపు రాఘవరెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. అయినా పోలీసులు అరెస్టు చేయకుండా నేడు మళ్లీ విచారణకు పిలిచారు. ఇవాళ సైతం పొంతన లేని సమాధానాలు చెప్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 13 , 2024 | 08:51 PM