Share News

Budget 2024: కేంద్ర బడ్జెట్‌ కాదు.. ఎన్నికల మేనిఫెస్టో: షర్మిల

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:48 PM

కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. నేటి కేంద్ర బడ్జెట్‌ ఎన్నికల మేనిఫెస్టో అనడం కరెక్ట్ అని విమర్శించారు.

Budget 2024:  కేంద్ర  బడ్జెట్‌ కాదు.. ఎన్నికల మేనిఫెస్టో: షర్మిల
YS Sharmila

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌ ఎన్నికల మేనిఫెస్టో అనడం కరెక్ట్ అని విమర్శించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా బడ్జెట్‌ను కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించారని మండిపడ్డారు. ఇది బడ్జెట్ నా.. లేదా ఎన్నికల హామీలా అనేది బీజేపీ పెద్దలు చెప్పాలని ప్రశ్నించారు.


అమరావతికి రూ.15 వేల కోట్లేనా..?

బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు సీఎం చంద్రబాబు లక్ష కోట్ల రూపాయలు అవసరమని చెప్పారని.. అసలు ఆ లక్ష కోట్లు అనే లెక్కలు ఎలా వేశారో తమకు అర్దం కాలేదన్నారు. విభజన చట్టంలోని అంశాలు అమలుకు రూ.12 నుంచి రూ.15 లక్షల కోట్లు అవసరమని తెలిపారు. చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా ఏడాదికి లక్ష కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 5 లక్షల కోట్లు చాలని చెప్పారని అన్నారు. అమరావతి రాజధానికి కేవలం రూ.15వేల కోట్లు ఇస్తున్నట్లు ఎలా చెప్పారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.


Also Read: Budget 2024: బడ్జెట్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు

పదేళ్లుగా ఏమీ చేయకపోయినప్పటికీ.. ఇప్పుడయినా పూర్తి చేస్తామని ముందుకు వచ్చారన్నారు. పోలవరం పునరావాస బాధితులకు ఎంత మేర నష్టపరిహారం ఇస్తున్నారని ప్రశ్నించారు. లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం విషయంలో పూర్తి గణాంకాలు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఇండస్ట్రీయల్ హబ్ నిర్మాణానికి సహకారం అందిస్తామని చెప్పినా.. డబ్బులు ఎంత ఇస్తారో కేంద్రం చెప్పలేదని అన్నారు.


ప్రత్యేక హోదా‌పై మాట్లాడరా....?

‘‘వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు అన్న వారు.. ఎప్పుడెప్పుడు ఎంత ఇస్తారో చెప్పలేదు. దీనిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అయినా సమాచారం ఉందా..? అసలు మానేసి కొసరు ఇచ్చినట్లుగా ఈ బడ్జెట్ గణాంకాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడటం లేదు. తిరుపతిలో సభ పెట్టి పదేళ్లు హోదా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చింది నిజం కాదా..? ఆ మాటను నిలబెట్టుకోవడం లేదని మీరే చెబుతున్నారా..? కనీస ప్రస్తావన కూడా బడ్జెట్‌లో లేదంటే మీరు మోసం చేసినట్లు కాదా..? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటింది.. ప్రజల హక్కు. పార్లమెంట్‌ యాక్ట్ అయినప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీపై లేదా..? హోదా లేకుంటే.. పరిశ్రమలు రాష్ట్రానికి ఎందుకు వస్తాయి. ఈ పదేళ్లల్లో కొత్తగా పది పరిశ్రమలు కూడా రాలేదు. హోదా లేకుండా ముష్టి పడేస్తామంటే మేము పండుగ చేసుకోవాలా’’ అని షర్మిల ప్రశ్నించారు.


Also Read: YS Jagan: ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్

చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించరా....?

‘‘ఏపీలో ఉన్న 25 మంది ఎంపీలు మొత్తం బీజేపీ ఎంపీలే. ఏపీ ఎంపీల ద్వారానే బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు సాధించడం లేదు. విశాఖ వంటి నగరాల్లో మెట్రో కూడా అవసరం లేదా..? చంద్రబాబు వంటి నాయకులు కూడా కేంద్రాన్ని ప్రశ్నించరా..? మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీకి అన్యాయం చేస్తూనే ఉన్నారు. మోదీ ఏపీని మోసం చేస్తూనే ఉన్నారు.. అందరూ ఆలోచన చేయండి. ఈ బడ్జెట్‌లా కాదు.. మేనిఫెస్టోలా ఉంది. ప్రజలు, యువత, చిరు వ్యాపారులు ఎవరూ హర్షించని బడ్జెట్ ఇది. ఈరోజు 1200 పాయింట్లు సెన్సెక్స్ కూడా కోల్పోయింది. చంద్రబాబు గారు మోసపోయింది చాలు.. బీజేపీకి మద్దతు ఇవ్వడం అనవసరం. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీకీ న్యాయం జరగదు’’ అని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Assembly: ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేదు

Sujanachowdary: ఏపీ చరిత్రలో చాలా శుభదినం

Pawan Kalyan: అలా చేస్తే కూటమి ప్రభుత్వానికే ఇబ్బంది.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 05:41 PM