AP Rain Alert :అల్పపీడనం ముప్పు..ఆ జిల్లాలకు హెచ్చరికలు
ABN , Publish Date - Dec 12 , 2024 | 11:13 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలో ఉదయం నుంచే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బలపడిన అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురువనున్నాయి.
నెల్లూరు జిల్లా: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి దొరవారి సత్రం, తడమండలాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం పడుతోంది. వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షం నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
కుండపోత వర్షానికి పంట పొలాలు జలమయమయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. గురువారం నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతుండటంతో తీరాన్ని చేరేవరకు లేదా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అందువల్ల శుక్రవారం వరకు వరి కోతలు కోయవద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. రెండు, మూడు రోజుల క్రితం కోసిన వరి పైరును కుప్పలు వేసుకుంటున్నారు.
అధికార యంత్రాంగం సన్నద్ధం
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.. కలెక్టరేట్‌తో పాటు అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మండలస్థాయి అధికారులు ఎవరూ సెలవు పెట్టవద్దని, మండల కేంద్రాల్లోనే ఉండి, ప్రజలకు అవసరం మేరకు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సముద్రంలో చేపల వేటను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు రానున్న రెండు రోజులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YSRCP: వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి జంప్..
Read Latest AP News And Telugu News