Ganta Srinivasa Rao: రుషికొండపై రాజభవనం.. గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jun 17 , 2024 | 08:07 PM
విశాఖలో రుషికొండ రాజభవనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ ఖర్చును వృథా చేసి అడంబరంగా కట్టారు. రుషికొండ భవనం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఏ ప్రభుత్వం, ప్రజలు జగన్ చేసిన చర్యలను తప్పుబడుతున్నారు.
విశాఖపట్నం: విశాఖలో రుషికొండ రాజభవనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ ఖర్చును వృథా చేసి అడంబరంగా కట్టారు. రుషికొండ భవనం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఏ ప్రభుత్వం, ప్రజలు జగన్ చేసిన చర్యలను తప్పుబడుతున్నారు. తాజాగా వైసీపీ, జగన్ రెడ్డిపై మాజీ మంత్రి, భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్( X) వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలా చేసి ఉంటే ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావు...
‘‘రాజకోట రహస్యం ఎన్నికలకు ముందే వెల్లడై ఉంటే మీకు 11 సీట్లు కూడా వచ్చేవి కావు. రుషికొండ భవన నిర్మాణంపై ఎందుకీ కుప్పిగంతులు, దాగుడుమూతలు? మొదట టూరిజం ప్రాజెక్ట్ అన్నారు. తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు. ఆ పైన సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. ప్రభుత్వ నిర్మాణమైనా, ప్రైవేట్ నిర్మాణమైనా ప్లాన్ వివరాలను ఆ కట్టడం దగ్గర ప్రదర్శిస్తారు. సెక్యూరిటీ కారణాల వల్ల అలా చేయలేదని మీరు సమర్ధించు కోవడం చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ బస చేయడానికి ఐ.ఎన్.ఎస్. డేగ, నేవల్ గెస్ట్ హౌస్ వంటి నిర్దిష్ట విడిది ప్రాంతాలు ఉన్నాయి. వి.వి.ఐ.పి.లు ఉండే భవనాలు కావడం వల్ల రుషికొండ మీద ఏం కడుతున్నామో చెప్పలేకపోయామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనడం హాస్యాస్పదం. సరైన అనుమతులు లేవని ప్రభుత్వమే నిర్మించిన ప్రజా వేదికను నిర్ధాక్షిణ్యంగా మీరు కూల్చివేశారు. మరి గ్రీన్ ట్రిబ్యునల్ మొదలు అనేక అభ్యంతరాలున్న రుషికొండ భవనాన్ని ఏం చెయ్యాలి’’ అని ప్రశ్నించారు.