Share News

MLA Ganababu: డెక్కన్ క్రానికల్ వైసీపీ తోక పత్రిక... గణబాబు సెటైర్లు

ABN , Publish Date - Jul 10 , 2024 | 08:43 PM

విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను డెక్కన్ క్రానికల్ దెబ్బతీస్తుందని, ఇది బాధకరమని, ఇది వైసీపీ తోక పత్రిక అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు (MLA Ganababu) విమర్శించారు. ఈరోజు(బుధవారం) ఎమ్మెల్యే కార్యాలయంలో గణబాబు మీడియా సమావేశం నిర్వహించారు.

MLA Ganababu: డెక్కన్ క్రానికల్  వైసీపీ తోక పత్రిక...  గణబాబు సెటైర్లు
MLA Ganababu

విశాఖపట్నం: విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను డెక్కన్ క్రానికల్ దెబ్బతీస్తుందని, ఇది బాధకరమని, ఇది వైసీపీ తోక పత్రిక అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు (MLA Ganababu) విమర్శించారు. ఈరోజు (బుధవారం) ఎమ్మెల్యే కార్యాలయంలో గణబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రికలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వచ్చిన కథనానికి పత్రికపై మండిపడ్డారు. డెక్కన్ క్రానికల్ కూడా నీలిమీడియా పక్షాన చేరిపోయిందని ఎద్దేవా చేశారు. విశాఖలో ఉద్యమాలు చేసి స్టీల్ ప్లాంట్ సాధించామని గుర్తుచేశారు.


సాక్షిలో పనిచేసి ఇప్పుడు డెక్కన్ క్రానికల్ జాయిన్ అయిన ఓ వ్యక్తి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అందరి మనోభావాలతో కూడుకున్న ఈ ప్లాంట్‌పై ఇలాంటి సమయంలో దుష్ప్రచారం చేయడం దురదృష్ట కరమని అన్నారు. మొన్నటివరకు జగన్ రెడ్డి కంపెనీలో పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు డెక్కన్ క్రానికల్లో చేరడం వల్ల ఈ వార్తను ప్రచురించారని ధ్వజమెత్తారు. డెక్కన్ క్రానికల్‌పై ప్రభుత్వ పరంగా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలతో పాటు విశాఖ ప్రజలు వైసీపీని ఛీ కొట్టారని విమర్శలు చేశారు.


ఇప్పటికి పద్ధతి మార్చుకోకుండా లేని వార్తను, తప్పుడు కథనాలతో ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్న జగన్ రెడ్డి ఈ వార్తను తీసుకువచ్చారని ఆరోపించారు. విశాఖకు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు వస్తున్న సమయంలో ఇలాంటి తప్పుడు వార్తలు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం, త్వరలో స్పష్టమైన సంకేతాలు ఉంటాయని వివరించారు.


కాగా.. డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద టీ‌ఎన్‌ఎస్ఎఫ్, తెలుగు మహిళ విభాగాల నిరసన చేపట్టారు. డెక్కన్ క్రానికల్ కార్యాలయ బోర్డును తెలుగు విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ దగ్ధం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని డెక్కన్ క్రానికల్ వార్తపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కార్యాలయం లోపలకు టీడీపీ నేతలు వెళ్లే ప్రయత్నం చేశారు, వారిని డీసీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది.

Updated Date - Jul 10 , 2024 | 08:43 PM