YS Sharmila: చంద్రబాబువి కనిపించే పొత్తులు, జగన్‌వి కనిపించని పొత్తులు.. వైఎస్ షర్మిల విసుర్లు
ABN , Publish Date - Jan 24 , 2024 | 12:15 PM
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్వరం మరింత పెంచారు. అధికార వైఎస్ఆర్ సీపీతోపాటు (YCP) తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు.
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్వరం మరింత పెంచారు. అధికార వైఎస్ఆర్ సీపీతోపాటు (YCP) తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్‌వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా ఏదీ..?
ఏపీ సీఎం జగన్‌పై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారని షర్మిల గుర్తుచేశారు. దాంతో ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారని వివరించారు. ప్రత్యేక హోదా ఏదీ అని అడిగారు. లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు గెలిచిన వెంటనే సీఎం జగన్ ఆ విషయం మరచిపోయారని మండిపడ్డారు. రాష్ట్రానికి హోదా కోసం ఒక్కరోజు కూడా ఉద్యమించలేదని స్పష్టంచేశారు. ఉత్తరాంధ్రను వైసీపీ, తెలుగుదేశం పార్టీ రెండు మోసం చేశాయని వివరించారు.
ప్రైవేట్‌కు అప్పగింత
ఉత్తరాంధ్రలో ఉన్న కంపెనీలను ప్రైవేట్‌కి అప్పగిస్తున్నారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గంగవరం పోర్టును అదానీకి తక్కువ ధరకు విక్రయించారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ఇందిరమ్మ హయాంలో ఏర్పడిందని గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం కుట్రలో భాగం అని షర్మిల ధ్వజమెత్తారు. నష్టాలు అని చెప్పి 30 వేల మంది కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు పత్తా లేకుండా పోయిందని షర్మిల విమర్శించారు. బీజేపీ తొత్తులుగా వైసీపీ, టీడీపీ ఉన్నాయని షర్మిల విమర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.