Share News

Aravind Kejriwal: కేజ్రీవాల్ క్రేజ్ పెరగడం ఖాయం.. ఢిల్లీలో ఆప్ హ్యాట్రిక్ అంటూ..?

ABN , Publish Date - Mar 23 , 2024 | 05:05 PM

అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆప్ నేతలు ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని విరుచుకుపడ్డారు. ఆప్ ఏర్పాటు చేసి 12 ఏళ్లు అవుతోంది. ప్రాంతీయ పార్టీ నుంచి గత ఏడాది జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. ఇంతలో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి, పార్టీని భూ స్థాపితం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.

Aravind Kejriwal: కేజ్రీవాల్ క్రేజ్ పెరగడం ఖాయం.. ఢిల్లీలో ఆప్ హ్యాట్రిక్ అంటూ..?

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు ఆద్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Aravind Kejriwal) అరెస్ట్ అయ్యారు. ఎన్నికల ముందే కేజ్రీవాల్‌ను (Kejriwal) ఎందుకు అరెస్ట్ చేశారు..? ఆప్ (AAP) బలపడుతోందని భారతీయ జనతా పార్టీ (BJP) భావించిందా..? అందుకే కేజ్రీవాల్‌ను (Kejriwal) అరెస్ట్ చేసి జైలుకు తరలించిందా..? అంటే ఔననే పొలిటికల్ ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ తీరును ఆప్ నేతలు ఖండిస్తున్నారు.

కేజ్రీ అంటే భయం

‘అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయం. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆప్ ఏర్పాటు చేసి 12 ఏళ్లు అవుతోంది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చింది. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి, పార్టీని భూ స్థాపితం చేయాలని అనుకుంటున్నారు. కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేసి అణగదొక్కాలని చూస్తున్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకోవడం సరికాదు. కాంగ్రెస్- ఆప్ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి ప్రభావం ఎన్నికల్లో కచ్చితంగా కనిపించనుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కూటమి 16 శాతం ఓట్లు సాధించింది. సీ ఓటర్‌కు చెందిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే వ్యక్తుల్లో కేజ్రీవాల్ ఒకరు. ప్రతిపక్ష కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కేజ్రీ, దీదీ 17 శాతం ఓట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఢిల్లీ ఎన్నికలు

మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలపై ఆప్ దృష్టి సారించనుంది. లోక్ సభ ఎన్నికల కన్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రయారిటీ ఇస్తోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 7 సీట్లను గెలిచింది. ఆ మరుసటి ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం 3 సీట్లను మాత్రమే గెలుచుకుంది. 2019లో బీజేపీ 7 లోక్ సభ సీట్లతో విజయం సాధించింది. 2020లో మాత్రం 8 అసెంబ్లీ సీట్లలో జయభేరి మోగించింది. 2015లో ఆప్ 67 సీట్లను గెలువగా... 2020లో 62 స్థానాలను కైవసం చేసుకుంది. గత పరిణామాలను బట్టి 2025లో ఆప్, కేజ్రీని దెబ్బకొట్టాలని బీజేపీ భావించింది. గత పదేళ్ల నుంచి తమ కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న కేజ్రీవాల్ టార్గెట్‌ చేసింది. అందుకోసం మీనాక్షి లేఖి, పర్వేశ్ సింగ్‌కు ఢిల్లీ బాధ్యతలను అప్పగించింది.

ఢిల్లీ సుల్తాన్

ఢిల్లీ ప్రజలకు ఉచిత కరెంట్, ఉచిత నీరు హామీ వల్ల అరవింద్ కేజ్రీవాల్ దగ్గరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీకి ఏ విధంగా క్రేజ్ ఉందో.. ఢిల్లీలో కేజ్రీవాల్‌కు ఆ చరిష్మా పనిచేసింది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగడంతో 30 శాతం మంది ఓటు వేశారు. ఆ సమయంలో పార్టీ, అభ్యర్థులు ఎవరని చూడలేదు. ఆప్‌కు 53.8 శాతం ఓట్లు రాగా 16 శాతం ఓట్లు కేజ్రీవాల్ పేరు మీద వచ్చాయి. బీజేపీ కన్నా ఆప్ 15 శాతం ఎక్కువ ఓట్లను కలిగి ఉంది. 2019లో బీజేపీకి 32 శాతం ఓటర్లు కేవలం మోదీ ప్రధాని అవుతారని మాత్రమే వేశారు. దేశంలో మోదీ మాదిరిగా ఢిల్లీలో కేజ్రీవాల్‌కు మంచి క్రేజ్ ఉంది.

క్రేజ్ ఇదే

జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా లాలు ప్రసాద్ యాదవ్, జయలలిత, జగన్ మోహన్ రెడ్డి క్రేజీ పెరిగింది. జగన్ సీఎం అయ్యారు. ఇప్పటికే ప్రజల్లో మంచి పేరున్న కేజ్రీవాల్ క్రేజ్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆప్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు. అరెస్ట్ చేయడంతో కేజ్రీవాల్‌కు సానుభూతి కలిగిందని లెక్కలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఓటు శాతం పెరుగుతుందని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Lok Sabha Polls: ఇండియా బ్లాక్‌లో చీలిక..? 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ

Updated Date - Mar 23 , 2024 | 05:09 PM