AAP: 3,4 రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్..? ఢిల్లీ మంత్రి సంచలనం
ABN , Publish Date - Feb 22 , 2024 | 07:05 PM
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడు, నాలుగు రోజుల్లో అరెస్ట్ చేస్తారని మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు గల కారణం తమ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమేనని వివరించారు.
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మూడు, నాలుగు రోజుల్లో అరెస్ట్ చేస్తారని మంత్రి అతిషి (Atishi) సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు గల కారణం తమ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమేనని వివరించారు. ఆప్- కాంగ్రెస్ పార్టీ (Congress) పొత్తుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకటన వచ్చిన వెంటనే ఢిల్లీ సీఎంను (Delhi CM) అరెస్ట్ చేస్తారని అతిషి చెబుతున్నారు. కేజ్రీవాల్‌కు సీబీఐ శనివారం లేదంటే ఆదివారం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారు అవుతున్న సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ అనే మేసెజ్ తమ పార్టీ నేతలకు వస్తున్నాయని వివరించారు. ఇండియా బ్లాక్ నుంచి తప్పుకోవాలని బెదిరించేందుకు ఆ మేసెజ్ ఇస్తున్నారని అతిషి ధ్వజమెత్తారు. అయినప్పటికీ తాము భయపడబోమని తేల్చి చెప్పారు. ఢిల్లీ, ఇతర చోట్ల కాంగ్రెస్ పార్టీతో పొత్తు చివరి దశకు చేరిందని వివరించారు. పోటీ చేసే స్థానాలపై అధికారిక ప్రకటన వెలువడనుందని వివరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఆరు సార్లు అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో బల నిరూపణ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఆ కేసులో కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు ఇస్తుందని, అరెస్ట్ చేస్తుందని ఆప్ మంత్రి అతిషి ఆరోపించారు. అతిషి చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.