Elections: 83 నియోజకవర్గాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు.. ఉత్కంఠ పోరులో గెలిచేదెవరు
ABN , Publish Date - Nov 01 , 2024 | 09:05 PM
ఎన్సీపీ, శివసేనలో చీలికల తర్వాత మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పార్టీ చీలికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. శివసేనలోని ఒక వర్గానికి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు. ఎన్సీపీ కూడా శరద్ పవార్, అజిత్ పవార్‌గా విడిపోయాయి. ఒకే పార్టీ రెండుగా చీలిపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో..
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. సరిగ్గా 19 రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (మహాయుతి), కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా (మహా వికాస్ అఘాడీ) కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్సీపీ, శివసేనలో చీలికల తర్వాత మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పార్టీ చీలికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. శివసేనలోని ఒక వర్గానికి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు. ఎన్సీపీ కూడా శరద్ పవార్, అజిత్ పవార్‌గా విడిపోయాయి. ఒకే పార్టీ రెండుగా చీలిపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఒకేపార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రెండు వేర్వేరు పార్టీలు, వేర్వేరు గుర్తులుగానే బరిలోకి దిగుతున్నారు. షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సిపి బిజెపితో పొత్తు పెట్టుకోగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి), శరద్ పవార్ ఎన్‌సిపి(ఎస్)లు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై క్లారిటీ వచ్చినట్లైంది. రాష్ట్రంలోని 47 అసెంబ్లీ స్థానాల్లో షిండే నేతృత్వంలోని శివసేన, శివసేన (యుబిటి) మధ్య పోరు కొనసాగుతుండగా, 36 స్థానాల్లో అజిత్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీ తలపడుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తిరేపుతోంది.
శివసేన vs శివసేన
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 82 స్థానాల్లో పోటీ చేస్తోంది. దీనిలో 47 స్థానాల్లో శివసేన (యుబిటి) అభ్యర్థులతో పోటీపడుతుండగా, మిగిలిన 35 స్థానాల్లో షిండే నేతృత్వంలోని అభ్యర్థులు కాంగ్రెస్, శరద్ పవార్‌కి చెందిన ఎన్‌సిపితో తలపడుతున్నారు. శివసేన వర్సెస్ శివసేన పోటీ చేసే 47 స్థానాల్లో 16 సీట్లు ముంబై రీజియన్ నుంచి, 18 సీట్లు కొంకణ్ రీజియన్ నుంచి ఉన్నాయి. ఇవి కాకుండా మరఠ్వాడా ప్రాంతంలోని 7 స్థానాల్లో శివసేన, శివసేన మధ్య పోరు నడుస్తోంది. మిగిలిన స్థానాలు విదర్భ, పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలో ఉన్నాయి.
ఎన్సీపీ vs ఎన్సీపీ
షిండే నేతృత్వంలోని శివసేన, శివసేన (యుబిటి) మధ్య 47 స్థానాల్లో పోటీ జరుగుతుండగా దాదాపు 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలోని 52 స్థానాల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి పోటీ చేయగా, అందులో 36 స్థానాల్లో శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి అభ్యర్థులతో పోటీపడుతున్నారు. మిగతా 16 స్థానాల్లో శివసేన (యుబిటి), కాంగ్రెస్‌తో పోటీ పడనున్నారు. పార్టీల్లో చీలికల నేపథ్యంలో ఒకేపార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here