Share News

ఓట్ల కుస్తీలో ఫొగట్‌ పట్టే ‘పట్టు’

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:18 AM

కుస్తీ యోధురాలు, ట్రిపుల్‌ ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగట్‌ హరియాణా ఎన్నికల సమరంలో మాత్రం ఓ ‘పట్టు’ పట్టారు. ఇటీవల ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో దురదృష్టవశాత్తు తృటిలో పతకం చేజారినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.

ఓట్ల కుస్తీలో ఫొగట్‌ పట్టే ‘పట్టు’

చండీగఢ్‌, అక్టోబరు 8: కుస్తీ యోధురాలు, ట్రిపుల్‌ ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగట్‌ హరియాణా ఎన్నికల సమరంలో మాత్రం ఓ ‘పట్టు’ పట్టారు. ఇటీవల ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో దురదృష్టవశాత్తు తృటిలో పతకం చేజారినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఫొగట్‌, తన సమీప అభ్యర్థి, బీజేపీకి చెందిన యోగేశ్‌ కుమార్‌పై 6,015 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కుస్తీ పోరులాగే మంగళవారం ఫొగట్‌ ఫలితం కూడా అభిమానులను మునివేళ్ల మీద నిలబెట్టి ఉత్కంఠకు గురిచేసింది. తొలుత ఆధిక్యం కనబరిచినా తర్వాత ఆమె వెనుకబడ్డారు. కౌంటింగ్‌ మధ్య రౌండ్లకొచ్చేసరికి మళ్లీ ఆధిక్యంలోకొచ్చి దాన్ని చివరిదాకా కొనసాగించారు.

2019లో జులానా నుంచి ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జేజేపీ అభ్యర్థి విజయం సాధించగా అంతకుముందు 2014, 2009 ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఇక్కడ జనం పట్టం కట్టారు. విజయం అనంతరం ఫొగట్‌ మీడియాతో మాట్లాడారు. ఫలితాల్లో తనకు ప్రజల ఆప్యాయత కనిపించిందని, రానున్న ఐదేళ్లలో ప్రజల అంచనాలను నిలబెడతానని, దేశం తనకు ఇచ్చిన ప్రేమ, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. వినేశ్‌ ఫొగట్‌ విజయంపై జాతీయ రెజ్లింగ్‌ సంఘం మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌ స్పందించారు. రెజ్లింగ్‌లో ఫొగట్‌ మోసంతో గెలిచేవారని, ఇక్కడా ఆమె మోసంతో గెలిచారని విమర్శించారు.

Updated Date - Oct 09 , 2024 | 04:18 AM