Medak: మెదక్‌లో ఇరు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత..
ABN , Publish Date - Jun 16 , 2024 | 05:21 AM
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోలిగడ్డకు చెందిన రాజ్‌అరుణ్ అనే యువకుడికి కడుపు, చేతిపై కత్తిపోట్లు పడ్డాయి. అతని వర్గీయులు వెళ్లి రాంనగర్‌లో కొందరిని పట్టుకోగా అక్కడా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.
జంతువధపై మొదలైన వివాదం.. బీజేవైఎం నేతకు కత్తి గాయాలు
లాఠీచార్జి.. పీఎస్ ముందు నిరసన
నేడు పట్టణ బంద్‌కు బీజేపీ పిలుపు
మెదక్ అర్బన్, జూన్ 15: మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోలిగడ్డకు చెందిన రాజ్‌అరుణ్ అనే యువకుడికి కడుపు, చేతిపై కత్తిపోట్లు పడ్డాయి. అతని వర్గీయులు వెళ్లి రాంనగర్‌లో కొందరిని పట్టుకోగా అక్కడా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో అతని వర్గీయులపై మరో వర్గం రాళ్ళతో దాడి చేసింది. నార్సింగి అనే యువకుడికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం గాయపడిన యువకుల వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో సంఖ్యలో చేరుకుని... రాళ్ల దాడి చేసిన వారు ఒక ప్రైవేటులో ఆస్పత్రిలో ఉన్నారని భావించి కర్రలతో ఆ ఆస్పత్రి అద్దాలను, ముందు నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు.
పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. దీంతో వారు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. రెండు గంటల పాటు నిరసన కొనసాగించారు. జిల్లా ఎస్పీ బాలస్వామి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యువకులు తిరిగి వెళ్లే మార్గంలో ఓ హోటల్ అద్దాలను. పాత బస్టాండ్ వద్ద పలు పాన్ షాపులను ధ్వంసం చేశారు.
మరోవైపు కోలిగడ్డలో ఓ ఇంటిపై ఒక వర్గం వారు రాళ్లు విసిరారు. ఇలా పరస్పర దాడులతో పట్టణం అట్టుడికింది. స్పెషల్ పార్టీ, ఏఆర్ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం పోలీసు వలయంలో ఉంది. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మెదక్ పట్టణ బంద్‌కు బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ పిలుపునిచ్చాయి.
ఘర్షణకు కారకులపై కఠిన చర్యలు: ఐజీ
మెదక్‌లో పరిస్థితి పూర్తి అదుపులో ఉందని ఐజీ రంగనాథ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఆయన మెదక్‌ను సందర్శించారు. ప్రజలందరూ సమన్వయం పాటించాలని కోరారు. ఘర్షణకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, వదంతులను నమ్మొద్దని సూచించారు.