Share News

Yadagirigutta: స్థానికులకు అంతరాలయ దర్శనం..

ABN , Publish Date - Jun 03 , 2024 | 05:12 AM

శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టపై పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధానాలయ ఉద్ఘాటనకు ముందు స్థానిక భక్తులకు గర్భాలయ (అంతరాలయ) దర్శనం ఉండేది. 2022 మార్చి 28న ఉద్ఘాటన అనంతరం కొండపైన ఉన్న పాత ఆచారాలు అన్నిటినీ గత ప్రభుత్వం పక్కనపెట్టింది.

Yadagirigutta: స్థానికులకు అంతరాలయ దర్శనం..

  • ప్రతి మంగళవారం అరగంటసేపు అవకాశం.. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు

  • గుర్తింపు కార్డు, సంప్రదాయ దుస్తులతో రావాలి

  • యాదగిరిగుట్ట నృసింహుడి గుడిలో పాత ఆచారాల పునరుద్ధరణకు చర్యలు

  • గుట్టపై భక్తులు నిద్ర చేసేందుకు ఏర్పాట్లు

  • 15 నుంచి కొండపై ‘ప్లాస్టిక్‌’ నిషేధం

యాదాద్రి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టపై పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధానాలయ ఉద్ఘాటనకు ముందు స్థానిక భక్తులకు గర్భాలయ (అంతరాలయ) దర్శనం ఉండేది. 2022 మార్చి 28న ఉద్ఘాటన అనంతరం కొండపైన ఉన్న పాత ఆచారాలు అన్నిటినీ గత ప్రభుత్వం పక్కనపెట్టింది. దీనిపై అప్పట్లో స్థానిక భక్తులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రతి వారం గర్భాలయ దర్శనం చేసుకోవటం ఆచారమని, దాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సూచనతో ప్రతి మంగళవారం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు స్థానిక చిరునామా ఉన్న గుర్తింపు కార్డుతో పాటు సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన భక్తులకు గర్భాలయ దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. యాదగిరిగుట్టపై ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు దర్శనమిస్తున్నాయి.


దీంతో కొండపై వాటిని ఈ నెల 15 నుంచి నిషేధించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జ్యూట్‌ బ్యాగులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్‌రావు తెలిపారు. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ప్రముఖ విద్వాంసులు, సంగీత కళాశాల విద్యార్థులతో కచేరీలు, సాహిత్య, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.


55 వేల మంది భక్తుల రాక

భువనగిరి అర్బన్‌: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ రీతిలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన చేశారు. సుమారు 55 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంట, ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఉభయ క్యూ లైన్లు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆలయ ఆవరణలో భక్తులు పరుగులు పెట్టారు. ఆలయం ఉత్తర దిశలో, అలాగే మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన షెడ్డు కింద భక్తులు అధిక సంఖ్యలో సేదతీరారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖాజానాకు రూ.78,59,736 ఆదాయం సమకూరిందని ఈవో భాస్కర్‌రావు తెలిపారు. కొండపైన బస్టాండ్‌లో ఆలయ అధికారులు వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయడంతో భక్తులు బస్సులు ఎక్కేందుకు తీవ్ర ఆటంకం కలిగింది.


కొండపై నిద్రచేసే భక్తులకు సౌకర్యాలు

గతంలో ఉమ్మడి నల్లగొండతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు ఎడ్లబండ్లు, వాహనాల్లో కొండపైకి చేరుకుని ఒక రాత్రి నిద్రచేసి స్వామివారికి మొక్కు చెల్లించుకునేవారు. కొండపైన కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో (గుండం) స్నానాలు చేసేవారు. గర్భాలయ ప్రదక్షిణకు, కొబ్బరికాయలు కొట్టేందుకు సౌకర్యాలు ఉండేవి. గత ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం అనంతరం పాత ఆచారాలను కొనసాగించలేదు. భక్తులు కొండ కింద ఉన్న సత్రాల్లో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇటీవల స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు. రాత్రివేళ భక్తులు నిద్ర చేసేందుకు డార్మెటరీ హాలు ఏర్పాటు చేశారు. వెయ్యిమంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది.

Updated Date - Jun 03 , 2024 | 05:12 AM