Share News

Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట.. కారణమిదే..

ABN , Publish Date - Dec 06 , 2024 | 06:01 PM

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ పి ఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది.

Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట.. కారణమిదే..

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో కొంతమంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. 2024 గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మెయిన్స్ ను వాయిదా వేయాలని కూడా అభ్యర్ధులు కోరారు.


హైకోర్టులో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు చుక్కెదురవడంతో పిటిషన్ కొట్టివేశారు. హైకోర్టు తీర్పును సుప్రీంలో ప్రిల్సిమ్స్ రాసిన అభ్యర్థులు సవాలు చేశారు. జస్టిస్ పి ఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని, దీనివల్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ తీవ్ర జాప్యమవుతుందని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


పేపర్ లీక్

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా.. ఒకసారి పేపర్ లీక్ అవడం కారణంగా, మరొకసారి నిర్వహణ లోపం కారణంగా రద్దు అయ్యాయి. రెండోసారి నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెల్లడించేలా అనుమతివ్వాలని సుప్రీంకోర్టును గత ప్రభుత్వం కోరింది. అయితే, ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోగా.. సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. దాంతో టీఎస్పీఎస్సీ 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి కొత్తగా 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.


వయో పరిమితి పెంపు..

గ్రూప్ -1 నోటిఫికేషన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సీ. వరుసగా రెండుసార్లు పరీక్ష రద్దు కావడం, రెండేళ్లు ముగియడంతో.. వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. దీంతో 46 ఏళ్ల వరకు అభ్యర్థులు ఈ గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పిచింది. రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 29 పెద్ద వివాదాన్నే రేపింది. ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, దీనిని రద్దు చేయాలని అభ్యర్థులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 354 పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. ఇవి పోగా మిగిలిన 209 పోస్టులకుగాను 1:50 నిష్పత్తిలో ప్రిలిమినరీ పరీక్షలో టాప్‌ 10,450 ర్యాంకులు సాధించిన వారందరినీ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. వీరిలో టాప్‌ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కూడా ఉంటారు. ఇక 354 పోస్టులకు 1:50 నిష్పత్తి చొప్పున 17,700 మంది రిజర్వ్‌డ్‌ కేటగిరీల అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ జీవో నెంబర్‌ 29 కింద మొత్తం 563 పోస్టులకూ రిజర్వేషన్‌ కేటగిరీతో నిమిత్తం లేకుండా 1:50 నిష్పత్తి ప్రకారం మొత్తం టాప్‌ 28,150 ర్యాంకులు సాధించిన వారందరినీ గుంపగుత్తగా మెయిన్స్‌కు ఎంపిక చేశారని అభ్యర్థులు చెబుతున్నారు.


రిజర్వేషన్‌ కేటగిరిలో..

అయితే ఈ విధానంలో ఒకవేళ ఏదైనా రిజర్వ్‌డ్‌ కేటగిరీకి అభ్యర్థులు తక్కువ పడితే 28,150 తర్వాతి వారిని తీసుకుంటున్నారని, ఓపెన్‌ కేటగిరీ కింద అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులను రిజర్వేషన్‌ కేటగిరిలో కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇది రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌కు పూర్తి విరుద్ధమని పేర్కొంటున్నారు. అందువల్ల జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీవో 55కు అనుగుణంగా మొత్తం 563 పోస్టులకు ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్‌కు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కానీ.. జీవో 29వల్ల అదనంగా మరో 3,233 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారని, దీంతో మొత్తం అభ్యర్థులు 31,383 మంది అయ్యారని వివరిస్తున్నారు. జీవో 55 ప్రకారమే మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.


జీవోలు ఏం చెబుతున్నాయి?

జీవో 29లో రిజర్వేషన్‌ల ప్రకారం కాకుండా.. నేరుగా మల్టీజోన్‌ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్పుడు రిజర్వుడు కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే, ఆ తర్వాత మెరిట్‌ వారిని కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనల్లోని రూల్‌ 22, 22ఏ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఇందుకోసం జీవో 55లోని అంశం ‘బి’లో మార్పులు చేసి జీవో 29ని ప్రభుత్వం జారీ చేసింది. జీవో 55 ప్రకారమైతే.. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను మల్టీజోన్‌ వారీగా ఉన్న పోస్టులకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్‌, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, స్పోర్ట్స్‌ తదితర కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో గుర్తిస్తారు. దీని ప్రకారం గతంలో 503 పోస్టులకు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండేది.


ఈ వార్తలు కూడా చదవండి

Congress: అస్థిరత నుంచి సుస్థిరత దాకా

CM Revanth Reddy: కేసీఆర్‌! ప్రతిపక్ష నేతగా.. నీ డ్యూటీ చెయ్‌

KTR: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా.. కాంగ్రెస్ తల్లినా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 06:06 PM