Anil Kumar Yadav : కేటీఆర్‌ను చూస్తే బాధేస్తోంది.. అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు
ABN , Publish Date - Jul 09 , 2024 | 07:26 PM
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను చూడ్డానికి పోయిన మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడ్డం చూసి బాధేస్తుందని అన్నారు. పవర్ వున్నప్పుడు యువరాజుగా ఉండే కేటీఆర్ పవర్ పోయాక తికమకగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం) గాంధీభవన్‌లో అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా బీఆర్ఎస్ కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ ముందు పెట్టి చేర్చుకుంది బీజీపీ కాదా అని నిలదీశారు. ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తమ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని స్పష్టం చేశారు. తాము గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను రమ్మని అడగడంలేదని చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించింది బీఆర్ఎస్, బీజేపీలేనని అని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత అని ఉద్ఘాటించారు. తెలంగాణ ఇచ్చే సమయంలో కేసీఆర్ కుటుంబం మొత్తం సోనియా కాళ్లమీద పడలేదా అని ప్రశ్నించారు. అప్పటి టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతామని చెప్పలేదా అని నిలదీశారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజీపీకి చీకటి ఒప్పందం చేసుకోలేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ బాగోతం అంతా అందరికి తెలుసునని అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు గుప్పించారు.