Bandi Sanjay: గవర్నర్ వ్యవస్థను కించపర్చిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదే..
ABN , Publish Date - Jan 26 , 2024 | 08:51 PM
గవర్నర్ వ్యవస్థను కించపర్చిన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానిదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు.
కరీంనగర్: గవర్నర్ వ్యవస్థను కించపర్చిన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానిదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరీంనగర్ నుంచే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించినట్లు తెలిపారు. ఈనెల 28వ తేదీన 20 వేల మందితో బీజేపీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మేళనానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారని వెల్లడించారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లోనే బీఆర్ఎస్ నేతలున్నారని ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.
గవర్నర్‌ను అసెంబ్లీలో అవమానించారు
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ది మూడో స్థానమేనని చెప్పారు. బీఆర్ఎస్‌నే ప్రజలు రద్దు చేశారన్నారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఒక మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని మండిపడ్డారు. గవర్నర్ పర్యటనలకు ప్రోటోకాల్ పాటించలేదన్నారు. అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీఆర్ఎస్ వ్యవహరించిందని.. అందుకే ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారని.. అయినా కూడా వాళ్ల అహంకారం ఇంకా తగ్గలేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు.