Beerla Ilaiah: బీఆర్ఎస్‌లో మిగిలేది ఆ నలుగురే.. బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:10 PM
బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Birla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని చెప్పారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Birla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ చేస్తే సంసారం, తాము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. తాము చేసేది ఫిరాయింపులు కాదన్నారు. రేవంత్ పాలన నచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తేల్చిచెప్పారు. తాము ప్రలోభాలు పెట్టి ఎమ్మెల్సీలను తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఈరోజు (మంగళవారం) సీఎల్పీ మీడియా సెంటర్‌లో బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ.. గల్లీలో మొహం చెల్లక ఢిల్లీకి వెళ్లి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లకు ఢిల్లీలో ఏం పని అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో ఏం పని ఉందని కేటీఆర్, హరీష్ వెళ్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై మాట్లాడే నైతిక విలువలు బీఆర్ఎస్ పార్టీకి లేవని అన్నారు.
గడీల పాలన చేసినందుకే గడీలు బద్దలుగొట్టి ప్రజాపాలన తెచ్చామని అన్నారు. కేటీఆర్, హరీష్, సురేష్ రెడ్డిలకు బుద్ధి లేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర పెట్టి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను ఊరూరా చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకే కేటీఆర్, హరీష్ ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది నలుగురేనని.. మిగిలిన నలుగురు బీఆర్ఎస్ పాడే మోస్తారని బీర్ల ఐలయ్య సెటైర్లు గుప్పించారు.