Share News

KTR: ఆ విషయంలో ఏఐసీసీపై కేటీఆర్ ఫైర్.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన కేటీఆర్..

ABN , Publish Date - Nov 17 , 2024 | 06:25 PM

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

KTR: ఆ విషయంలో ఏఐసీసీపై కేటీఆర్ ఫైర్.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన కేటీఆర్..
BRS Working President KTR

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉందా అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇంత కంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటుందా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇంతకీ ఏఐసీసీకి ఎందుకంత సంతృప్తి అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.


ప్రశ్నల వర్షం..

ఏఐసీసీకి ఎందుకంత సంతృప్తి.. తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా?, అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా ?, కొడంగల్‌లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా?, కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా ?, మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా ?, హైడ్రా పేరిట పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నందుకా ?, ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా ?, రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా ?, తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి.. ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా?, సంక్షేమానికి సమాధి కట్టి.. అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా?, తెలంగాణలోని సకల రంగాలను.. సబ్బండ వర్గాలను దగా చేసినందుకా?, మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుకా? ఎందుకు మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి అంటూ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.


ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా.. మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని.. గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి నాలుగు కోట్ల తెలంగాణ సమాజం రగిలిపోతోందని ఆయన అన్నారు. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాత పెట్టాలని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.


కిషన్ రెడ్డిపై ఆగ్రహం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా మారిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ పార్టీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్‌గా మరో ట్వీట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. "దోస్తును కాపాడేందుకే చీకటి రాజకీయం. వారెవ్వా తోడు దొంగల నాటకం. కిషన్ రెడ్డి గారూ.. మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా?, లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే.. బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది మేము. రేవంత్‌ను మొదట అభినందించింది మీరైతే.. మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి?. ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసం?. రేవంత్‌ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగనామాలు పెట్టింది. మీ పాలి'ట్రిక్స్'ను గమనిస్తోంది తెలంగాణ. ఆట కట్టిస్తుంది సరైన వేళ" అంటూ ట్వీట్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Raja Narasimha: ఖమ్మం ర్యాగింగ్ ఘటనపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం..

Konda Surekha: ఫోన్ ట్యాపింగ్‌పై షాకింగ్ విషయాలు బయటపెట్టిన మంత్రి కొండా సురేఖ

Bandi Sanjay : తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Updated Date - Nov 17 , 2024 | 06:41 PM