Akkineni Nagarjuna: కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం క్షోభించింది
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:30 PM
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya), సమంత (Samanta) విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కారణమంటూ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తీవ్రంగా ఖండించారు. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది. చివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున. క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు (గురువారం) నాంపల్లి కోర్టులో పిటిషన్ విచారణ జరిగింది. ప్రొసిజర్ ప్రకారం పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. నాగార్జున స్టేట్మెంట్ తర్వాత సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది.
అయితే.. మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్ట దావా వేశారు. పరువు నష్ట దావాలో ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేశారు. నాంపల్లి స్పెషల్ కోర్టులో న్యాయవాది గురుమిత్ సింగ్ కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్‌పై కొండా సురేఖ తరుపు న్యాయవాది ఈరోజు వాదనలు వినిపించారు.
నాగార్జున కుటుంబం కుంగిపోయింది..
‘‘కొండ సురేఖ నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ట్విట్టర్లో క్షమాపణ కోరుతూ పోస్ట్ చేసింది. ట్విట్టర్లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్ట్‌ను కోర్ట్ ముందు నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యద భావించవద్దని కొండా సురేఖ ట్విట్ చేసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు. ఈ కామెంట్స్‌తో నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయారు’’ అని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు.
నాగార్జున ఏమన్నారంటే..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ.. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావించి మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. ‘‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని నాగార్జున అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి.. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధారమైన, అవాస్తవ వ్యాఖ్యలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సేరేఖ
మరోవైపు.. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘అనుకోని సందర్భంలో.. అనుకోకుండా ఓ కుటుంబంపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. కేటీఆర్ నన్ను కించపరిచే విధంగా మాట్లాడారు. ఆ మాటలతో వేదనకు గురై ఆయన గురించి వాఖ్యలు చేసే క్రమంలో అనుకోకుండా నాగార్జున కుటుంబం గురించి మాట్లాడా. ఆ వాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నా. కానీ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది లేదు’’ అని కొండా సురేఖ స్పష్టం చేశారు.తాను వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎక్స్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆ కుటుంబం ఆవేదనతో చేసిన పోస్టులు చూసి తనకు బాధ అనిపించిందని, ఆ కుటుంబాన్ని తన వాఖ్యలు నొప్పించాయని తెలిసి బాధ పడ్డాననని పేర్కొన్నారు. తాను పడిన బాధ వాళ్లు పడకూడదనే ఉద్దేశంతో.. తన వాఖ్యలను వెనక్కి తీసుకుంటూ తాను కూడా ఎక్స్‌లో పోస్టు చేశానని తెలిపారు. కేటీఆర్ తనను మరింత రెచ్చగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘‘కేటీఆర్‌కు నేను క్షమాపణ చెప్పడమేంటని.. ఆయనే నాకు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. దొంగే ‘దొంగా దొంగా’ అన్నట్టుగా కేటీఆర్ ప్రవర్తన ఉందని.. ఆయన తనపై పెట్టించిన పోస్టులన్నింటినీ తొలగించాలని దుయ్యబట్టారు. తన కంటే ముందు.. మంత్రి సీతక్కపై ఇంకా ఘోరంగా ట్రోల్ చేశారని ఆవేదన వెలిబుచ్చారు. మహిళలను ట్రోల్ చెయ్యొద్దని బీఆర్ఎస్కు హితవు పలికిన ఆమె.. ‘‘కేటీఆర్ నీకు మహిళలు పనికిమాలిన వాళ్లలా కనిపిస్తున్నారా? మీ కుటుంబ సభ్యులే మహిళలా? నీ నోరు ఏ యాసిడ్‌తో కడగాలి?’’ అంటూ నిప్పులు చెరిగారు.
వారిని కేటీఆర్ దుబాయ్‌లో దాచి పెట్టారు..
తనను ట్రోల్ చేసినవారిని కేటీఆర్ దుబాయ్‌లో దాచి పెట్టారని ఆరోపించారు. వెంటనే వారిని తీసుకొచ్చి అప్పగించాలని డిమాండ్ చేశారు. సినీ పెద్దల స్పందన వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారో, లేదో తనకు తెలియదన్నారు. కేటీఆర్ ఇచ్చిన నోటీసులను తాను లీగల్‌గా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతండడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. దీనిపై వివరణ ఇవ్వాలని సురేఖకు సూచించారు. దీంతో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ట్వీట్ చేశారు. ‘‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప.. సమంతా, మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు’’ అని స్పష్టం చేశారు. ‘‘స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానమే కాదు.. ఆదర్శం కూడా’’ అని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.