Tammineni: ఆ ఒప్పందాలు బయటపెట్టాలి.. సీఎం రేవంత్‌కు తమ్మినేని వీరభద్రం సవాల్
ABN , Publish Date - Dec 01 , 2024 | 07:59 PM
అదానీని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల చెక్కు ఎందుకు తీసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. అదానీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
సిద్దిపేట జిల్లా: లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న దొంగ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గజ్వేల్ పట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మూడో మహాసభ ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... అదానీని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల చెక్కు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. అమెరికాలోని దావోస్‌లో అదానీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రూ.1750 కోట్లను అదానీ ఇచ్చారని ఆరోపించారు. దేశ సంపదను అంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని విమర్శలు చేశారు. దేశానికి వీళ్లిద్దరూ చీడపురుగులు అని తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదానీ స్కాంపై రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..
‘‘ఒక సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే అదానీ సంస్థ నుంచి రూ.100 కోట్లు స్వీకరించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేయవద్దు’’ అంటూ పేర్కొంటూ లేఖ రాశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అదానీ విషయంలో పక్క దేశాలు, రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదానికి, తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వివాదాల్లోకి అనవసరంగా తమను, తమ ప్రభుత్వాన్ని లాగవద్దని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
సౌరవిద్యుత్ కొనుగోలులో ఆరోపణలు
కాగా.. సెకీ నుంచి 7వేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోలు కోసం డిస్కంలతో కలిపి ఏపీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 1న ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో 4,667 మెగా వాట్ల అదానీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి 2,333 మెగావాట్ల అజార్ పవర్ ఇండియా నుంచి కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేలా సెకీ.. ఆ సంస్థలతో మరో ఒప్పందం చేసుకుంది.సెకీకి 2,333 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా ప్రాజెక్టులో తాము కొనసాగలేమంటూ సీటీయుఐఎల్ 2023 జులై 6 నిర్వహంచిన సమీక్ష సమావేశంలో అజార్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలియజేసింది. సెకీతో తాము కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగేందుకు అనుమతించాలని విన్నవిస్తూ సెకీకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసింది.