Share News

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే నేడు బీజేపీ పాలన

ABN , Publish Date - Aug 10 , 2024 | 03:14 AM

క్విటిండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే  నేడు బీజేపీ పాలన

  • క్విటిండియా ఉద్యమం వల్లే ప్రజలకు స్వేచ్ఛ బ్రిటిషోళ్లను మహాత్మాగాంధీ తరిమికొట్టారు

  • నేడు రాహుల్‌ బీజేపీని తరిమికొడతారు: జగ్గారెడ్డి

  • క్విటిండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పతాకం ఆవిష్కరణ

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): క్విటిండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అనాడు బ్రిటి్‌షవారు పరిపాలించినట్లుగానే ఈ నాడు బీజేపీ ప్రభుత్వ పాలన ఉందన్నారు. ఆనాడు దేశ స్వాతంత్య్ర కోసం మహాత్మాగాంధీ పోరాటం చేస్తే.. ఈనాడు దేశ ప్రజల కోసం రాహుల్‌ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిన బ్రిటి్‌షవారిని క్విటిండియా వంటి ఉద్యమాలతో మహాత్మాగాంధీ కాంగ్రెస్‌ తరిమికొట్టిందన్నారు.


అదే బ్రిటి్‌షవారి తరహాలో ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీని.. తరిమికొట్టేది రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అని వ్యాఖ్యానించారు. ఈ రోజున దేశ ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో ఉన్నారంటే.. ఆనాడు గాంధీ మొదలు పెట్టిన క్విట్‌ ఇండియా ఉద్యమ ఫలితమేనని చెప్పారు. గాంధీ మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఉధృతమై చివరికి ఆగస్టు 15, 1947లో బ్రిటి్‌షవారు దేశానికి స్వాతంత్య్రం ప్రకటించి వెళ్లి పోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఆనాడు రగిల్చిన ఉద్యమ స్ఫూర్తి.. ప్రజల్లో ఇప్పటికీ నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలను ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారంటే ఆనాడు గాంధీ, నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ తదితరులు చేసిన త్యాగాలే కారణమన్నారు.


ఈ త్యాగధనుల చరిత్రను ఈ తరం యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే నెహ్రూ, ఇందిరమ్మల చరిత్రను వక్రీకరించే పనిలో కొందరు ఉన్నారన్నారు. క్విటిండియా ఉద్యమ వ్యతిరేకులు.. ఈనాడు దేశాన్ని పాలిస్తున్నారని, ఆనాటి బ్రిటిష్‌ పాలకుల మాదిరిగానే కులం.. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసుండాలన్నదే రాహుల్‌గాంధీ ఆలోచనన్నారు. అందుకే ఆయన భారత్‌ జోడో యాత్రను చేశారని గుర్తు చేశారు. సొంత ఆస్తులను ప్రజలకోసం దారాదత్తం చేసిన చరిత్ర రాహుల్‌గాంధీ కుటుంబానిదన్నారు. అలాంటి గాంధీకుటుంబంపైన మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు.


గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేయాలని మోదీ ప్రయత్నిస్తే.. దేశ ప్రజలు రాహుల్‌గాంధీని ప్రధాన ప్రతిపక్ష నేతను చేసి కూర్చోపెట్టారన్నారు. ప్రజలు.. రాహుల్‌ను వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలమంతా రాహుల్‌, సోనియా, మల్లికార్జున ఖర్గేల అడుగు జాడల్లో నడుస్తామన్నారు. టీపీసీసీ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ మాజీ కార్యని ర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ్‌కుమార్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు జి. నిరంజన్‌, కుమార్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, క్విటిండియా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌ నుంచి గన్‌పార్కు వరకు సేవాదాళ్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని జగ్గారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

Updated Date - Aug 10 , 2024 | 03:14 AM