BRS MLA'S: గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS ఎమ్మెల్యేల ధ్వజం
ABN , Publish Date - Aug 05 , 2024 | 03:17 PM
ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదని స్పష్టం చేశారు.
ఢిల్లీ: ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదని స్పష్టం చేశారు. సోమవారం నాడు ఢిల్లీ వేదికగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ... కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయమని తాము సూచిస్తున్నా ప్రభుత్వం వినడం లేదని ధ్వజమెత్తారు. వరద వస్తేనే నీటిని ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నారు..
గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని చెప్పారు. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు లేవని చెప్పారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎందుకు లిఫ్ట్ చేయరని ప్రశ్నించారు. చాలా జిల్లాల్లో తాగు, సాగు నీరు లేకుండా పోయిందని విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాకు చూపుతూ నీటిని లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కన్నేపల్లి పంప్ ఆన్ చేసి మిడ్ మానేరు నింపాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
ALSO Read: Niranjan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు భ్రమలు తొలిగాయి
మల్లన్న సాగర్ నింపాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
అన్నారం, మేడిగడ్డ ద్వారా వివిధ రిజర్వాయర్లు నింపితే వచ్చే నీరు పాత మెదక్ జిల్లాకు చేరేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు. మల్లన్న సాగర్ నింపి కూడవెళ్లి వాగు ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందేదని చెప్పారు. మొత్తంగా 3 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. పొలాలు ఎండిపోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు విదేశీ పర్యటనలో ఉన్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
నీళ్లు అందించకపోతే ధర్నాలు చేస్తాం..
ఇప్పటికైనా మించిపోయింది లేదని... ఆలస్యంగానైనా రైతులు నాట్లు వేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తమ ప్రాజెక్టులకు నీళ్లు అందించకపోతే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. గతంలో లక్షల ఎకరాల్లో నాట్లు వేసి వ్యవసాయం చేయగా, ఈసారి వేల ఎకరాల్లో కూడా నాట్లు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడం మానేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మీద కోపం రైతులపై చూపిస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Nagarjunasagar: నాగార్జునసాగర్ 13, 14 గేట్లు ఎత్తివేత
KTR: ‘యథా రాజా తథా ప్రజా’.. దళిత మహిళపై దాడిని ఖండించిన కేటీఆర్
Jagadish Reddy: పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వట్లేదు
Read latest Telangana News And Telugu News