Bhatti Vikramarka: ప్రధాని మోదీని కలుస్తాం.. మల్లు భట్టి విక్రమార్క షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jun 20 , 2024 | 06:03 PM
తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి..ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.
ఖమ్మం జిల్లా: తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి..ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సింగరేణి బంద్ అయిపోతే ఆ ప్రాంతంలో ఉన్న వేలాది మంది ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంస్థ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనీ కలుస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వారిని కలుపుకుని ప్రధానిని కలుస్తామని తెలిపారు.
తెలంగాణ ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తాము ఈ పని చేస్తామని తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నావేనని అన్నారు. తమకు మద్దతు తెలిపిన సీపీఐ, మిగతా రాజకీయ పార్టీలను కలుపుకుని మోదీ దగ్గరకు వెళ్తామని వివరించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు(గురువారం) మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరానికి సంబంధించి, రాష్ట్ర, దేశ ప్రజలకు తెలియాలని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల అవసరాలు గురించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ మొదలు పెడుతుందని చెప్పారు. రేపు హైదరాబాద్ నగరంలో ఆక్షన్ జరగబోతుందని తెలిపారు.
బొగ్గు ఉత్పత్తి పడిపోతుంది
‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులకు విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం మాటలు ఉన్నాయి. దాదాపు నలభై రెండు వేల మంది ఉద్యోగస్తులు నేరుగా సింగరేణిలో పని చేస్తున్నారు, 26 వేల మంది ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్నారు. ఇన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థ గురించి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సి ఉంది. 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి 2026 కి పూర్తిగా పడిపోతుంది. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031, 32 వరకు నిలబెట్టుకోవాలన్న సింగరేణి కొత్త బొగ్గు గనులను సంపాదించుకోవాలి. లేదా సింగరేణి అనేది చరిత్ర లా నిలిచిపోతుంది. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, నేరుగా జీ 2 జీ చేయాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ 1957 చట్టం ప్రకారం సవరణ తీసుకుని వచ్చి దేశంలో ఉన్న బొగ్గు గనులు అన్నింటినీ ఆక్షన్ ద్వారా నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చింది.తెలంగాణ ప్రయోజనాల గురించి బీఆర్ఎస్ మాట్లాడటం సరికాదు’’ అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఆ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
‘‘కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మేము పదేళ్లు సింగరేణిని కాపాడమని మాట్లాడుతున్నారు. 2021 అక్టోబర్ 29వ తేదీన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. నవంబర్ 5 న గత సీఎం కేసీఆర్ ఒక కోర్ కమిటీ నిర్వహించారు. కేసీఆర్ గోదావరి ప్రాంతాల గనులు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు. రెండు కంపెనీలు బీఆర్ఎస్ పార్టీకి దగ్గరి వాళ్లవి కాబట్టి సింగరేణికి కాకుండా వాళ్లకు ఇచ్చేశారు. ఒరిస్సాలో బల్క్ ఈ బ్లాక్ అని ఉంది. దాని ఒక్కదానికి బిడ్ వేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్లు బీజేపీ మంత్రులు మాట్లాడుతున్నారు. తెలంగాణలో తలమానికంగా ఉన్న ఈ శాఖ మీ దగ్గరకు వచ్చింది. సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తాం.రాష్ట్రంలో నిజంగా సమయం తీసుకుని ప్రధానిని, కిషన్ రెడ్డిని అందరం కలిసి కలుద్దాం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా 0.5 పర్సంట్ చూపించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం. ఆ రెండు బ్లాక్‌లు కూడ మేము అడుగుతాం ఆ రెండు సంస్థల సమయం కూడా మించి పోయింది కాబట్టి వాటిని ఇతర కంపెనీలకు ఆక్షన్ పెట్టకుండా అడుగుతాం. ఎవరో వ్యక్తి అంటున్నాడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ కానీ ఇంకా ఎవరైనా మాట్లాడటానికి, చర్చకు కాగితాలతో రావాలి’’ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.