Share News

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ శాస్త్రవేత్తలను క్యాబ్ డ్రైవర్లుగా మార్చింది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

ABN , Publish Date - Sep 07 , 2024 | 02:27 PM

బయోడైవర్సిటీ(Biodiversity) ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) డిమాండ్ చేశారు.

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ శాస్త్రవేత్తలను క్యాబ్ డ్రైవర్లుగా మార్చింది: ఎమ్మెల్యే హరీశ్ రావు..

సిద్ధిపేట: బయోడైవర్సిటీ(Biodiversity) ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (MLA Harish Rao) డిమాండ్ చేశారు. ప్రతి నెలా ఒకటో తారీకునే జీతాలు చెల్లిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలని మరోసారి రుజువైందన్నారు. బయోడైవర్సిటీ ఉద్యోగులు సంవత్సరం నుంచి జీతాలు లేక నానావస్థలు పడుతున్నారని మండిపడ్డారు. వారికి జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని, సంవత్సర కాలంగా ఉద్యోగులను కాంగ్రెస్ వేధింపులకు గురిచేసిందని ధ్వజమెత్తారు. తక్షణమే రూ.10కోట్ల నిధులు కేటాయించి ఆదుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


పరిశోధన చేయాల్సిన బయోడైవర్సిటీ శాస్త్రవేత్తలను కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్లుగా మార్చిందని ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. జీతాలు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్య ధోరణి వహించడంతో కుటుంబ పోషణ భారంగా మారి శాస్త్రవేత్తలు క్యాబ్‌లు నడుపుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. నిత్యం రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చే రేవంత్ కొంచెం ఉద్యోగులపైనా దృష్టి సారించాలని హితవు పలికారు. వెంటనే నిధులు మంజూరు చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్న బయోడైవర్సిటీ శాస్త్రవేత్తలు, ఉద్యోగులను ఆదుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Updated Date - Sep 07 , 2024 | 02:27 PM