TG: చలో ఏపీ!
ABN , Publish Date - May 11 , 2024 | 06:04 AM
సహజంగా.. పెద్ద పండుగైన సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటుంది. ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి వెళ్లే క్రమంలో వాహనాలతో ఈ మార్గం కిటకిటలాడుతుంటుంది. కానీ, ఏ పండుగా లేకున్నా.. ఇప్పుడు అలాంటి సందడే కనిపిస్తోంది. ఓట్ల పండుగకు ఏపీ వాసులు సొంత ప్రాంతానికి పయనం కావడమే దీనికి కారణం.
హైదరాబాద్ నుంచి తరలిన లక్షలాది ఓటర్లు
ఈ నెల 13న ఎన్నికల్లో ఓటేసేందుకు పయనం
వరుసగా 3 రోజులు సెలవులతో స్వగ్రామాలకు
విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ
బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలోనూ సందడి
చార్జీలు అమాంతం పెంచేసిన ఆర్టీసీ, ట్రావెల్స్
రవాణా కోసం ఏర్పాట్లు చేసిన ప్రధాన పార్టీలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, చౌటుప్పల్, మే 10(ఆంధ్రజ్యోతి): సహజంగా.. పెద్ద పండుగైన సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంటుంది. ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి వెళ్లే క్రమంలో వాహనాలతో ఈ మార్గం కిటకిటలాడుతుంటుంది. కానీ, ఏ పండుగా లేకున్నా.. ఇప్పుడు అలాంటి సందడే కనిపిస్తోంది. ఓట్ల పండుగకు ఏపీ వాసులు సొంత ప్రాంతానికి పయనం కావడమే దీనికి కారణం. లోక్‌సభతో పాటు పొరుగు రాష్ట్రంలో ఈ నెల 13న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11వ తేదీ రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో ఏపీలో ఓటు ఉన్నవారు శుక్రవారమే ప్రయాణమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని హైదరాబాద్-విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. విజయవాడ వైపు పంతంగి టోల్ గేట్ నుంచి రోజూ 30వేల నుంచి 35 వేల వాహనాలు వెళ్తుంటాయి. శుక్రవారం ఐదు వేల వాహనాలు అధికంగా వెళ్లాయి. రద్దీ 13వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనుండడంతో టోల్‌గేట్ వద్ద జీఎంఆర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా మీదుగా అదనంగా 2 వేల వాహనాలు రాకపోకలు సాగించాయి. వాహనాల రద్దీ గంటగంటకూ పెరుగుతోందని, ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ ఏపీకి వెళ్తున్నవారితో రద్దీ ఏర్పడింది. ఉద్యోగుల్లో వీలు కుదిరినవారు శుక్రవారం కూడా సెలవుపెట్టి గురువారం రాత్రే బయల్దేరారు. గురు, శుక్రవారాల్లో సొంత వాహనాల ద్వారా దాదాపు 12వేల మంది వెళ్లినట్లు సమాచారం. ఏపీలో ఓటు ఉండి తెలంగాణలో నివసిస్తున్నవారు 30 లక్షల వరకు ఉన్నారు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 18 లక్షల మంది ఉన్నట్లు అంచనా.
రద్దీని సొమ్ము చేసుకునేందుకు..
ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ 2 వేల అదనపు సర్వీసులను నడుపుతోంది. ఇక హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ఓటర్ల నుంచి సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ఆపరేటర్లు రవాణా చార్జీలను భారీగా పెంచారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గుంటూరుకు టికెట్ రూ.700 ఉంటుంది. ఇప్పుడు మూడు రెట్లు పెంచారు. ప్రముఖ ట్రావెల్స్ సంస్థల టికెట్ రేట్లు విమాన చార్జీలతో పోటీ పడుతున్నాయి. గుంటూరుకు శనివారం రూ.2,271 నుంచి రూ.2,426 చార్జి చేశారు. తిరుపతికి రూ.2,899 వరకు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నంకు అయితే రూ.3 వేల నుంచి రూ.3,600 పైమాటే.
40-45 మందికి ప్రత్యేక బస్సు
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వారి ప్రతి ఓటునూ ఆ రాష్ట్ర నాయకులు కీలకంగా భావిస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా శేరిలింగంపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మూసాపేట్, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లోని కార్యాలయాలు, అపార్ట్‌మెంట్లు, కాలనీలు, బస్తీల వద్ద సందడి నెలకొంది. ఓటర్లను ఏపీ నాయకులు జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. 40-45 మందికి బస్సు ఏర్పాటు చేస్తున్నారు. పరిమితి మించితే మరో బస్సును పెడుతున్నారు. హైదరాబాద్‌లోనే కాక తెలంగాణలోని వివిధచోట్ల ఉంటూ ఏపీలో ఓటున్నవారిని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, టీడీపీ, వైసీపీ ముఖ్య నాయకులంతా నెల రోజులుగా ఏపీ ఓటర్లతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశాలు పెట్టి పోలింగ్ నాడు వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించారు.
కాకినాడకు 40 బస్సులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ స్థానం కాకినాడ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గానికి శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి 40 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఓ పార్టీ నాయకులు 2,800 మందిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. బస్సులను ఇష్టపడని కుటుంబాలకు కార్లు సమకూర్చుతున్నారు. మూడు రోజుల్లో 15 వేల మందిని బస్సుల్లోనే తరలించారు. మరో 40-60వేల మందిని తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ నిర్వాహకులు చెబుతున్నారు.