NMC: ఆ 4 వైద్య కళాశాలలపై ఎన్‌ఎంసీకి మరోసారి అప్పీల్
ABN , Publish Date - Aug 06 , 2024 | 02:47 AM
జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు రాని నాలుగు కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది.
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు రాని నాలుగు కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. మొత్తం 8 కళాశాలలకు దరఖాస్తు చేయగా నాలుగింటికే గతవారం ఎన్‌ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌వోపీ) ఇచ్చింది. ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య ప్రవేశాలకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదు.
వీటి ఎల్‌వోపీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండోమారు అప్పీల్ చేసింది. ఈ కాలేజీల్లో లోపాలను నిర్ణీత సమయంలోగా సరిచేస్తామని ఎన్‌ఎంసీకి తెలిపింది. ఈ నెల 13లోగా దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఆలోగా అనుమతులు వస్తే విద్యార్థులు ఆ కొత్త కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.