Share News

Elections: ఢిల్లీలో ఓట్ల పండుగ.. కాసేపట్లో షెడ్యూల్

ABN , Publish Date - Jan 07 , 2025 | 10:47 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో మేమున్నామంటూ కాంగ్రెస్ సైతం ఆప్, బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఢిల్లీ ఓటరు ఎవరివైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.

Elections: ఢిల్లీలో ఓట్ల పండుగ.. కాసేపట్లో షెడ్యూల్
Delhi Assembly Elections

దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఫిబ్రవరి మొదటివారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో మేమున్నామంటూ కాంగ్రెస్ సైతం ఆప్, బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఢిల్లీ ఓటరు ఎవరివైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. 2013, 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఢిల్లీలో పాగా వేసేందుకు ఆమాద్మీ పార్టీ అధ్యక్షులు కేజ్రీవాల్ తన వ్యూహాలకు పదునుపెడుతుంటే.. ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీని దక్కించుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుకెళ్లి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన అతిషిని ముఖ్యమంత్రిని చేశారు. ఢిల్లీ ప్రజల తీర్పు తర్వాతనే మళ్లీ సీఎం పీఠంపై కూర్చుంటానంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఆప్ మెజార్టీ సాధిస్తే కేజ్రీవాల్ వరుసగా నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేస్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను అక్రమంగా ఇరికించిందని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజలు తనవెంట ఉన్నారని, ప్రజాతీర్పు తనకు శిరోధార్యమని చెప్పడంతో పాటు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ఆప్ ఓడితే మాత్రం కేజ్రీవాల్‌కు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ఢిల్లీ అసెంబ్లీకి 1993లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఎప్పుడూ బీజేపీ ఢిల్లీలో గెలివలేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 12 ఏళ్లు ఢిల్లీని పాలించింది. 27 ఏళ్ల తర్వాత ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.


ఒకే విడతలో

ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 నియోజకవర్గాలున్నాయి. మొత్తం నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది కేంద్రంలో 2014 నుంచి బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అక్కడి ఓటర్లు ఆదరించడంలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు సీట్లను క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఆశించినంత ప్రభావం చూపించలేకపోతుంది. ఈసారి మాత్రం ఆప్‌ను ఓడించి ఢిల్లీ శాసనసభను దక్కించుకోవాలనే ప్రణాళికలతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఆప్ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో ఆమాద్మీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీచేస్తున్నాయి. త్రిముఖ పోరులో ఢిల్లీలో అధికారం ఎవరనేది ఆసక్తి రేపుతోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 07 , 2025 | 10:47 AM