Delimitation Meeting: డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల నేతల సమావేశం
ABN, Publish Date - Mar 22 , 2025 | 08:41 PM
పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజనపై (డీలిమిటేషన్) తమ వాణిని బలంగా వినిపించేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణకు దిగాయి. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో శనివారం నాడు తొలి జేఏసీ సమావేశం జరిగింది.

పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజనపై (డీలిమిటేషన్) తమ వాణిని బలంగా వినిపించేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడి కార్యాచరణకు దిగాయి.

ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు తొలి జేఏసీ సమావేశం జరిగింది. దీనికి కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్‌లో ఉంటుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు.

చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాగా, టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. అయితే ముందస్తు కార్యక్రమాల కారణంగా తాను హాజరుకాలేకపోతున్నానని, డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణకు తన మద్దతు ఉంటుందని ఒక లేఖ రాశారు.

ఆ లేఖను జేఏసీ సమావేశంలో చదివి వినిపించారు. బీజేడీ, సీపీఐ, ఐయూఎంఎల్, మరికొన్ని ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తమ ప్రతినిధులను ఎవ్వరినీ పంపలేదు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జేఏసీ సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రాతినిధ్యాన్ని పటిష్టం చేసే ఎలాంటి చర్యలను తాము వ్యతిరేకించడం లేదని, అయితే నిష్పాక్షిక రాజకీయ ప్రాతినిధ్యం దిశగా చర్యలు ఉండాలని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

డీలిమిటేషన్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డీలిమిటేషన్ రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని చెప్పారు. దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి కూడా లోక్‌సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

జనాభా ప్రతిపదికనను నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

డీలిమిటేషన్‌కు తాము వ్యతిరేకం కాదని, నిష్పాక్షికంగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలని సీఎం స్టాలిన్ అన్నారు.

ప్రాతినిధ్యం తగ్గితే రాష్ట్రాలకు నిధుల విషయంలో పోరాటాలకు దారితీస్తుందని సీఎం స్టాలిన్ అన్నారు. తీసుకునే నిర్ణయాలు తమ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయని, తమ విద్యార్థులు కీలకమైన అవకాశాలు కోల్పోతారని సీఎం స్టాలిన్ అన్నారు.

రైతులకు ఎలాంటి మద్దతు ఉండబోదని సీఎం స్టాలిన్ అన్నారు. మన సంస్కృతి, వృద్ధి ప్రమాదంలో పడతాయని ఆందోళ వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం దెబ్బతింటుందని సీఎం స్టాలిన్ తెలిపారు.

డీలిమిటేషన్‌తో ప్రాతినిధ్యం తగ్గితే సొంత దేశంలోనే పొలిటికల్ పవర్‌ను మనం కోల్పోతామని సీఎం స్టాలిన్ చెప్పారు.

ప్రస్తుత జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరగరాదని, దీనిని తాము బలంగా వ్యతిరేకిస్తున్నామని సీఎం స్టాలిన్ అన్నారు. ప్రాతినిధ్యం తగ్గితే పార్లమెంటులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాలను కూడా కోల్పోతామని సీఎం స్టాలిన్ చెప్పారు.

ఈ సమావేశంలో కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా డీలిమిటేషన్ ప్రక్రియతో ముందుకు వెళ్లేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఆలోచనగా ఉందనే వార్తలు వస్తున్నాయని అన్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియ చాలా కీలకమైనందున ప్రజాస్వామ్య ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూసేందుకు అన్ని పార్టీలతో కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్చలు జరపాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సూచించారు.
Updated at - Mar 22 , 2025 | 08:51 PM