Sankranti : సంక్రాంతి రోజున నవగ్రహాల అనుగ్రహం కోసం.. ఇది తినాలంట..
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:14 PM
మకర సంక్రాంతి రోజున ఈ వంటకం చేసుకుని తింటే నవగ్రహాల అనుగ్రహం కలిగి పాపాలన్నీ తొలగిపోతాయని, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే, ఆ వంటకం ఏమిటి? ఎందుకు చేసుకుంటారనే విషయాలు వివరంగా తెలుసుకుందాం..
సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి సంచరించగానే సంక్రాంతి మొదలవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమైన తొలిరోజే నదిలో పుణ్య స్నానాలు, దానాలు చేయడం మంచిదని చెబుతారు. దేశవ్యాప్తంగా వేర్వేరు పేర్లతో ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త బియ్యంతో బెల్లం కలిపి ఆరుబయట పొంగళ్లు తయారుచేయడం, భోగి మంటలు,పండుగ మూడు రోజులూ ఇంటి ముందు ముగ్గులు పెట్టడం, గొబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు ఎగరేయడం, కోడిపందాలు, కొత్త అల్లుళ్లు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఆచారాలున్నాయి. అలాగే ఉత్తరాదిలో ఒక సంప్రదాయం అనాదిగా వస్తోంది. మకర సంక్రాంతి రోజున ఈ వంటకాన్ని చేసుకోవడం అక్కడివారి సంప్రదాయం. ఈ రోజున ఇది తింటే నవగ్రహాల అనుగ్రహం కలిగి పాపాలన్నీ తొలగిపోతాయని, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని నమ్ముతారు.అయితే దీని వెనుక కారణం ఏమిటి? ఇది కేవలం సంప్రదాయమా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ ఆధారం ఉందా? అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.
మకర సంక్రాంతి రోజున ఎందుకు చేస్తారు?
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, కిచిడీ చేయడానికి పప్పులు, బియ్యం, నీరు, ఉప్పు, పసుపు ఉపయోగిస్తారు. అంటే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, తెలుపు, నీలం, నలుపు సహా అన్ని రంగులు ఇందులో ఉంటాయి. ఈ రంగులన్నీ వివిధ నవగ్రహాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. కిచిడీలో ఉపయోగించే పసుపు గురువుకు సంబంధించినదిగా పరిగణించబడుతుంది. నల్ల ఉప్పు శని, రాహువు, కేతువులకు సంబంధించినది. అదేవిధంగా, పచ్చి కాయధాన్యాలు బుధుడుకి, బియ్యం శుక్రుడు మరియు చంద్రుని చిహ్నంగా వర్ణించబడింది. కిచిడీని వండినప్పుడు దాని నుంచి వచ్చే వెచ్చదనం సూర్యడు మరియు అంగారక గ్రహానికి సంబంధించినదని.ఈ కిచిడీని సేవించడం ద్వారా మొత్తం తొమ్మిది గ్రహాల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
సంక్రాంతి రోజున కిచిడీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
శాస్త్రీయ ప్రాతిపదికన చూస్తే, మకర సంక్రాంతి రోజున కిచిడీ తినడం శరీరానికి చాలా మేలు చేస్తుంది. నిజానికి జనవరిలో చలి తీవ్రత ఎక్కువగా ఉండి అందరూ వణికిపోతుంటారు. అటువంటి పరిస్థితిలో వేడి వేడి కిచిడీ తినడం వల్ల జలుబు, జ్వరాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది సులువుగా జీర్ణం అవుతుంది కాబట్టి కడుపుకి ఉపశమనం లభించినట్లవుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. శరీరానికి కొత్త శక్తిని వచ్చి హాయిగా అనిపిస్తుంది. వేరే పదార్థాలు తింటే ఈ ప్రయోజనాలన్నీ ఏకకాలంలో లభించవు. ఈ కారణంగానే మకర సంక్రాంతి నాడు కిచిడీ తినడం, అవసరంలో ఉన్నవారికి దానం చేయడం మంచిదని పెద్దలు చెబుతారు.
బీహార్ ప్రజలు సంక్రాంతి పండుగని 'తిలా సంకరాయత్' పేరుతో, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో 'మకర్ సక్రాత్ లేదా కిచిడీ పర్వ్' అనే పేరిట ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడి ప్రజలు ప్రతి మకర సంక్రాంతికి తప్పక కిచిడీ చేసుకుని ఆరగిస్తారు. అలా చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసిస్తారు.