Mandakrishna Madiga: చంద్రబాబు అరెస్ట్ విషయంలో వారి వెంటే ఉంటాం

ABN , First Publish Date - 2023-09-10T18:36:50+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ (Chandrababu arrested) విషయంలో తెలుగుదేశం, ఇతర పక్షాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే, ఆందోళన కార్యక్రమాలు చేపడుతే ఎమ్మార్పీఎస్ అదే నిర్ణయం తీసుకుంటుందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) తెలిపారు.

Mandakrishna Madiga:  చంద్రబాబు అరెస్ట్ విషయంలో వారి  వెంటే ఉంటాం

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ (Chandrababu arrested) విషయంలో తెలుగుదేశం, ఇతర పక్షాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే, ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఎమ్మార్పీఎస్ అదే నిర్ణయం తీసుకుంటుందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) తెలిపారు. శనివారం(నిన్న) తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘74 ఏళ్ల వయస్సు కలిగిన మాజీ ముఖ్యమంత్రితో పోలీసులు, పాలకులు అమర్యాదగా నడుచుకున్నారు. అరెస్ట్ విషయంలో చంద్రబాబు వయస్సు, హోదాను ఏమాత్రం గౌరవించినట్లు కనిపించలేదు. ఇలాంటి సందర్భంలో గవర్నర్‌కు చెప్పి నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబును ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా మొదటగా పోలీసులు చెప్పలేదు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో అంతిమ నిర్ణయం న్యాయం స్థానానిదే. చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే చేసినట్లు కనిపిస్తోంది. వివేకారెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ కాకుండా అదే పోలీసుల మద్దతు కోరారు. జగన్మోహన్‌రెడ్డి తన వాళ్లకు ఒక లాగా, ఇతరులకు మరోలాగ వ్యవహరిస్తున్నారు. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయడం లేదు. ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును 37వ నిందితుడిగా ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు.పోలీసులు చంద్రబాబు పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. గవర్నర్(Governor) దృష్టికి తీసుకురాకుండా అరెస్ట్ చేశారంటే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

కరోనా కాలంలో డాక్టర్ సుధాకర్‌(Dr. Sudhakar)ను కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు చాలా రకాలుగా వేధించారు. పోలీసులు నడిరోడ్డుపై పడేసి వెనకకు చేతులు విరిచి ఆయనపై దుర్మార్గంగా వ్యవహరించారు. డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం ప్రభుత్వ వేధింపులే. జగన్మోహన్‌రెడ్డి తమ ప్రభుత్వ మోసాలను ఎండగడితే శత్రువులుగా చూస్తారు. ప్రజాస్వామ్యం బతకాలంటే పౌరులు పాలకులు ప్రతిపక్షాలు గౌరవించాలి. చంద్రబాబు హయాంలో అణచివేత 5శాతం కనిపిస్తే.. జగన్‌రెడ్డి ప్రభుత్వంలో 100- 200 శాతం కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణి కనిపిస్తోంది. సంబంధిత డిపార్ట్‌మెంట్ అధికారులు బాధ్యత వహిస్తారు.. ఈ కేసులో అజయ్ కల్లం, ప్రేమేందర్‌రెడ్డిలు ఉన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓబుళాపురం గనుల కుంభకోణం విషయంలో అప్పటి సీనియర్ అధికారి శ్రీదేవిపై చర్యలు తీసుకోని అరెస్ట్ చేసి జైల్‌కు పంపించారు. కానీ ఈ కేసులో అధికారులు అజయ్ కల్లం, ప్రేమేందర్‌రెడ్డిలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జగన్ తనకు గిట్టని వారిని శత్రువులుగా భావిస్తారు... నచ్చిన వారిని హత్యలు చేసినా కపాడుకుంటారని అర్థం అవుతుంది’’ అని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-10T18:36:50+05:30 IST