Ugadi Wishes: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ABN , First Publish Date - 2023-03-22T09:49:17+05:30 IST

శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Ugadi Wishes: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

అమరావతి: శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu), టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు శుభాలు చేకూరాలని, రాష్ట్రాలతో పాటు దేశం అభివృద్ధి చెందాలని ప్రముఖులు ఆకాంక్షించారు.

శుభప్రదమైన మార్పును స్వాగతిద్దాం: చంద్రబాబు

తెలుగు ప్రజలకు ఉగాది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మనందరం శోభకృత్ నామ తెలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, ఏపీ ప్రజల జీవితాల్లో కొత్త ఏడాది పెనుమార్పులు తేబోతుంది, రాష్ట్రానికి శుభసూచకం, శుభప్రదమైన ఆ మార్పును స్వాగతిద్దామని టీడీపీ అధినేత ఆకాంక్షించారు.

తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు: రామకృష్ణ

తెలుగు వారందరికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ తెలుగు సంవత్సరాది అన్ని వర్గాల ప్రజల ముంగిళ్ళలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించటం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అడుగడుగున ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాలను, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని మోదీ ప్రభుత్వం దిగిపోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

రైతులు, ప్రజలకు శుభాలు చేకూర్చాలి: కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు (Telangana CM KCR) ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 'శోభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

అన్నీ శుభాలే జరగాలి: జగన్

రాష్ట్ర ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్‌మోహన రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్కచెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ తెలిపారు.

తెలుగు లోగిళ్లు కొత్త శోభ సంత‌రించుకోవాలి: లోకేష్

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయ పండ‌గ ఉగాది సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియజేశారు. శోభ‌కృత్ నామ సంవ‌త్స‌రం అంద‌రికీ శుభాలు క‌ల‌గ‌జేయాలని ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లు కొత్త శోభ సంత‌రించుకోవాలన్నారు. కొత్త ఆశయాలు నెర‌వేరి సుఖ‌సంతోషాల‌తో, ఆయురారోగ్యాల‌తో న‌వ్యోత్సాహంతో ఉగాది జ‌రుపుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు.

Updated Date - 2023-03-22T09:49:17+05:30 IST