Lok Sabha Election 2024: ‘విపక్ష సీఎంలను అందుకే జైల్లో వేస్తున్నారు’
ABN , Publish Date - May 23 , 2024 | 12:34 PM
ప్రధాని నరేంద్ర మోదీపై(PM Narendra Modi) సంచలన ఆరోపణలు చేశారు సీఐపీ నేత నారాయణ(CPI Narayana). పొలిటికల్ ప్రచారంపై ఎన్నికల కమిషన్(Election Commission of India) ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని..
అమరావతి, మే 23: ప్రధాని నరేంద్ర మోదీపై(PM Narendra Modi) సంచలన ఆరోపణలు చేశారు సీఐపీ నేత నారాయణ(CPI Narayana). పొలిటికల్ ప్రచారంపై ఎన్నికల కమిషన్(Election Commission of India) ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీ.. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో రాజాసింగ్ ఉత్తరప్రదేశ్ నుంచి బుల్డోజర్లు వస్తాయని అన్నారని.. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా అలాంటి భాషనే మాట్లాడుతున్నారని విమర్శించారు నారాయణ. రాజ్యాంగాన్ని కూల్చడానికి బుల్డోజర్లతో నరేంద్ర మోడీ దాడి చేస్తున్నారంటూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.
రాజ్యంగ వ్యతిరేకంగా కామెంట్స్..
ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ.. ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని నారాయణ ప్రశ్నించారు. మోదీకి అనుకూలంగా ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేశారని నారాయణ విమర్శించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను చూసి మోదీ భయపడుతున్నారని.. అందుకే ఆయన్ను జైల్లో వేయించారని సీపీఐ నేత ఆరోపించారు. కక్షపూరితంగా, అప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. భయంతోనే ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను జైల్లో పెట్టిస్తున్నారని నారాయణ ఆరోపించారు.
అన్ని సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి..
బీజేపీకి 400 సీట్లు వస్తాయని సృష్టిస్తున్నారని.. ఆ పార్టీకి 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయని నారాయణ ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లే బీజేపీ బలపడుతుందన్నారు. మోదీకి అనుకూలంగా ఉండే టీవీలోనే ఈసారి బీజేపీ 320 స్థానాలకు పైగా గెలుస్తారని చెబుతున్నారన్నారు. మోదీ ప్రభుత్వం పోవాలని దేశ వ్యాప్తంగా ప్రజల బలంగా కోరుకుంటున్నట్లు నారాయణ చెప్పారు. దేశంలో అవినీతి లేదని ప్రధాని మోదీ చెబుతున్నారని.. కానీ, అన్నింట్లో అవినీతి రాజ్యమేలుతోందని నారాయణ ఆరోపించారు. గుజరాత్‌లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ ఒక గంజాయి స్మగ్లర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు నారాయణ. అదాని లాంటి వాళ్లకు కృత్రిమ లాభాలు సృష్టిస్తున్నారని అన్నారు. నేర సామ్రాజ్యానికి ప్రధాని మోదీ వెన్నుదన్నుగా ఉన్నారంటూ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఉన్నది వైసీపీ సామ్రాజ్యమే..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా ఉన్నతాధికారులను మార్చారు గానీ.. కిందిస్థాయిలో మొత్తం వైసీపీ సామ్రాజ్యమే ఉందని సీపీఐ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత గొడవలు జరుగుతుంటే.. ముఖ్య నాయకులు విదేశాలకు వెళ్లిపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. వీరి ప్రవర్తన పూర్తిగా బాధ్యతారహితంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాలు అన్నీ తారుమారుగా ఉంటాయని.. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది మోడీ డిసైడ్ చేస్తారని అన్నారు.