AP Elections 2024: రాజధానిపై జగన్ నిర్ణయం ఇదే.. అమరావతిపై మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే!
ABN , Publish Date - Apr 27 , 2024 | 03:15 PM
ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో క్లారిటీ ఇస్తూ వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి పేర్కొంటూ.. పెన్షన్‌ను 2028లో రూ.250, 2029లో మరో రూ.250 చొప్పున ఐదో ఏడాదికి రూ.3,500కు పెంచుతామని హామీ ఇచ్చారు. పాత హామీలకే రంగులద్ది కొత్త మేనిఫెస్టోలో చేర్చారు.
ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో క్లారిటీ ఇస్తూ వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి పేర్కొంటూ.. పెన్షన్‌ను 2028లో రూ.250, 2029లో మరో రూ.250 చొప్పున ఐదో ఏడాదికి రూ.3,500కు పెంచుతామని హామీ ఇచ్చారు. పాత హామీలకే రంగులద్ది కొత్త మేనిఫెస్టోలో చేర్చారు. ఇక రాజధాని అంశాన్ని వైసీపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. విశాఖను పరిపాలన రాజధానిగా అభివృద్ధి చేస్తామని, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పొందుపర్చారు.
2014లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రతిపక్ష పార్టీగా తన అంగీకారం తెలిపిన వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇలా 3 రాజధానుల పేరిట ఐదేళ్లూ వైసీపీ కాలక్షేపం చేస్తూ వచ్చింది. విజయవాడకు సమీపంలో ఉండటంతో పాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండటంతో అమరావతిని రాజధానిగా ఉండాలని ఎక్కువమంది ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు విశాఖపట్టణాన్ని మహానగరంగా అభివృద్ధి చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు తప్పా.. రాజధాని కావాలని అడగటం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను రాజధానిగా చేస్తామని ప్రకటించినా.. అక్కడి ప్రజల నుంచి సానుకూల స్పందన కనిపించలేదు. అయినప్పటికీ వైసీపీ మాత్రం రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామని తాజాగా మేనిఫెస్టోలో చేర్చింది.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా..
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం భూములు సేకరించిది, రహదారులు నిర్మించింది. అభివృద్ధి పనులను ప్రారంభించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను నిలిపివేసింది. దీంతో ఏపీ రాజధానిపై అయోమయం నెలకొంది. విశాఖకు పరిపాలనను షిఫ్ట్ చేస్తామంటూ రెండేళ్ల నుంచి ప్రకటిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఏపీ ప్రజలు అమరావతి రాజధానికి మద్దతు పలికారు. కానీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆ పనులు ముందుకు కదలలేదు. మరోవైపు రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉద్యమం చేస్తూ వస్తున్నారు. రైతుల ఉద్యమాలను ప్రభుత్వం అణచివేసే ప్రయత్నాలు చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అమరావతి రైతలు ఉద్యమానికి మద్దతు లభించింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామంటూ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది.
భూముల కోసమేనంటూ..
విశాఖపట్టణం చుట్టుపక్కల ఉన్న భూములపై వైసీపీ నేతలు కన్నువేశారని, దీంతోనే ఈప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని వైసీపీ పట్టుదలకు వెళ్తుందనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నాయకులు ఈ ప్రాంతంలో భూములు కొన్నారని, వాటి ధరలు పెంచుకుని కోట్ల రూపాయిలు దోచుకోవడానికి విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారనే విమర్శలు ఉన్నాయి. ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వక్తమైనా.. ఎన్ని ఆరోపణలు వచ్చినా వైసీపీ మాత్రం మూడు రాజధానులే మా నినాదమంటూ మేనిఫెస్టోలో చేర్చింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని విషయంలో న్యాయస్థానాలు ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందనేది వేచిచూడాల్సి ఉంది. న్యాయస్థానంలో రాజధాని అంశం ఉండగా వైసీపీ మాత్రం మూడు రాజధానులను అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. దీనిపై ఓటర్లు ఎలా స్పందిస్తారనేది జూన్4న తేలనుంది.
YSRCP Manifesto 2024: మళ్లీ గెలిస్తే.. అమ్మ ఒడి పెంపు: సీఎం జగన్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh and Telugu News Here