Minister Ravi: జగన్ పైశాచికం మరోసారి బయటపడింది
ABN , Publish Date - Aug 02 , 2024 | 09:05 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైశాచికం ఏ విధంగా ఉంటుందో ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ వద్దే మరోసారి బయటపడిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి (Minister Gottipati Ravi) విమర్శించారు.
అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైశాచికం ఏ విధంగా ఉంటుందో ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ వద్దే మరోసారి బయటపడిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి (Minister Gottipati Ravi) విమర్శించారు. జగన్ అధికారంలో ఉండగా ప్రజావేదిక కూల్చి సమస్యలు చెప్పుకునే వేదిక లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం నాడు మంత్రి గొట్టిపాటి రవి, పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి, అశోక్ బాబు వినతులు స్వీకరించారు.
అనంతరం మీడియాతో మంత్రి రవి మాట్లాడుతూ...అధికారం పోయాక ఇంటికొచ్చిన కార్యకర్తలను హింసించి పంపుతున్నారని ఆరోపించారు. అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ తలుపులు నిరంతరం తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు నాయకులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని వివరించారు.
అడ్డగోలు నిబంధనలతో గత ప్రభుత్వం ఫించన్‌లు తొలగించదనే ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. బలవంతపు భూ మార్పిడులు, వైసీపీ నేతలు భూ కబ్జాలు, అక్రమ కేసులపై తమ వద్దకు ప్రజలు పోటెత్తుతున్నారని మంత్రి చెప్పారు. తెలుగుదేశం శ్రేణులపై నమోదైన అక్రమ కేసులపై ఎస్పీలతో నేరుగా మాట్లాడానని చెప్పారు. తమకు ఒకసారి అర్జీ ఇస్తే దాని సమస్య పరిష్కారం కోసమే పార్టీ కార్యాలయం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బిందు సేద్యం నిర్వీర్యం: మంత్రి అచ్చెన్న
మరోవైపు.. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బిందు సేద్యం నిర్వీర్యమైందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. దేశంలో ముందున్న రాష్ట్రాన్ని దేశంలోనే చివరి స్థానంలోకి జగన్ ప్రభుత్వం తీసుకెళ్లిందని విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ కూడా జగన్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదన్నారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం తీవ్ర కక్ష పూరిత ధోరణి అవలంభించిందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రైతులకు, రైతు శ్రేయస్సు కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.