Cyber Crime: మచిలీపట్నంలో మరో ఆన్‌లైన్ మోసం..
ABN , Publish Date - Aug 30 , 2024 | 09:38 AM
రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.
కృష్ణా: రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు. వందల మంది నుంచి కోట్లు కాజేశారు. అత్యాసకు పోయి మోసపోయిన వారంతా డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
మోసపోయారిలా..
మచిలీపట్నంలో వాట్సాప్ యాప్ ద్వారా కేటుగాళ్లు కోట్లు కొల్లగొట్టారు. వెయ్యి కడితే 90రోజుల్లో రూ.1,400 చెల్లిస్తామంటూ సైబర్ మోసగాళ్లు విస్తృత ప్రచారం చేశారు. ఇది నమ్మిన ప్రజలు ఒక్కొక్కరుగా నగదు చెల్లించడం మెుదలుపెట్టారు. కొన్ని రోజులపాటు సమయానికి తిరిగి డబ్బులు చెల్లించారు. దీంతో మంచి లాభాలు వస్తున్నాయంటూ ప్రచారం జరిగింది. ఈ మేరకు మోసగాళ్ల మాటలు నమ్మి వందల మంది అందులో జాయిన్ అయ్యారు. వీరందరికీ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి నగదు వసూలు చేయడం ప్రారంభించారు. అలా కోట్లు రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టించారు.
అయితే కొన్ని రోజులపాటు నగదు వసూలు చేసిన కేటుగాళ్లు.. రూ.5వేల వరకూ కట్టిన వారికి కరెక్టుగానే చెల్లించారు. రూ.10వేల నుంచి రూ.5లక్షల వరకూ కట్టిన వారికి ఎలాంటి నగదు చెల్లింపులూ చేయలేదు. పైగా మూడ్రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్, ఇతర గ్రూపులను నిర్వహకులు తొలగించారు. డబ్బులు వెనక్కి రాకపోవడం, ఫోన్లకు స్పందించకపోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించారు.
దీంతో వారంతా పోలీసులను ఆశ్రయించారు. వారి మాటలు నమ్మి కోట్లు రూపాయలు పోగొట్టుకున్నామని, తమ నగదు ఎలాగైనా తిరిగి ఇప్పించాలంటూ ఫిర్యాదు చేశారు. పిల్లలు చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడతాయని అత్యాసకు పోయామని లబోదిబోమంటున్నారు. త్వరగా నిందితులను పట్టుకుని డబ్బులు ఇప్పించాలని, ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను బాధితులంతా కోరారు.