Share News

Delhi : ఉప ఎన్నికల్లో ఇండియా హవా

ABN , Publish Date - Jul 14 , 2024 | 02:47 AM

లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో ఇండియా కూటమి సత్తా చాటింది. 7 రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో పది సీట్లను కూటమి గెలుచుకుంది.

Delhi : ఉప ఎన్నికల్లో ఇండియా హవా

  • 13 అసెంబ్లీ సీట్లకు 10 కైవసం.. బీజేపీకి రెండే

  • పశ్చిమ బెంగాల్‌లో నాలుగూ తృణమూల్‌కే

  • హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ విజయం

  • బిహార్‌లో జేడీయూపై స్వతంత్ర అభ్యర్థి గెలుపు

  • ఈ ఫలితాలు మార్పునకు సంకేతం: జైరాం

  • 13 స్థానాలకు 10 కైవసం.. బీజేపీ రెండింటికే పరిమితం.. పశ్చిమబెంగాల్‌లో నాలుగుకు నాలుగూ టీఎంసీకే

  • బీజేపీ సృష్టించిన భయం, భ్రమలు పటాపంచలు: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో ఇండియా కూటమి సత్తా చాటింది. 7 రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో పది సీట్లను కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్‌ 4, తృణమూల్‌ కాంగ్రెస్‌ 4, డీఎంకే, ఆప్‌ ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బీజేపీ కేవలం రెండు సీట్లకు పరిమితం కాగా, మరొకటి స్వతంత్ర అభ్యర్థి గెల్చుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌ (4), హిమాచల్‌ ప్రదేశ్‌ (3), ఉత్తరాఖండ్‌ (2), పంజాబ్‌ (1), మధ్యప్రదేశ్‌ (1), బిహార్‌ (1), తమిళనాడు (1) రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. పశ్చిమబెంగాల్‌లో నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులైన బీజేపీ అభ్యర్థులపై విజయం సాధించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేయటంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

రెండింటిని అధికారపక్షమైన కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. వీటిలో ఒకటైన డెహ్రా స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌ సుఖు భార్య కమలేశ్‌ థాకూర్‌ గెలిచారు. తాజా ఫలితాలతో, 68 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 40కి చేరుకుంది. దీంతో ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంఛార్జి రాజీవ్‌ శుక్లా పేర్కొన్నారు. ఇక బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరిగిన రెండు స్థానాలనూ కాంగ్రెస్‌ గెల్చుకుంది.


బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తమ్మీద రెండు స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడులో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండియా కూటమికి చెందిన డీఎంకే అభ్యర్థి.. ఎన్‌డీఏ కూటమికి చెందిన పీఎంకే అభ్యర్థిని ఓడించారు. కాగా, పంజాబ్‌లో పశ్చిమ జలంధర్‌ నుంచి గతంలో ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) తరఫున గెలిచిన శీతల్‌ అంగురల్‌ మార్చి నెలలో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అక్కడ తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో శీతల్‌పై ఆప్‌ అభ్యర్థి మొహిందర్‌ భగత్‌ ఘన విజయం సాధించారు.

ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున గెల్చిన అభ్యర్థి రాజీనామా చేసి, లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్‌ తిరిగి గెల్చుకుంది. బిహార్‌లో ఒక స్థానానికి జరిగిన ఎన్నికలో జేడీయూ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

కేజ్రీ ప్రాణాలతో బీజేపీ చెలగాటం

కేజ్రీవాల్‌ ప్రాణాలతో బీజేపీ చెలగాటమాడుతోందని ఆప్‌ ఆరోపించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం కేజ్రీవాల్‌ను అనారోగ్యానికి గురిచేస్తూ బాధపెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. ఈ ఏడాది మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన రోజు కేజ్రీవాల్‌ 70 కేజీల బరువున్నారని జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణించి8.5 కిలోల బరువు తగ్గారని తెలిపారు. ఆయన షుగర్‌ లెవల్స్‌ సాధారణ స్థాయి కంటే 5రెట్లు పడిపోయాయన్నారు.

ప్రజలు నియంతృత్వాన్ని రూపుమాపాలనుకుంటున్నారు: రాహుల్‌

ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. బీజేపీ సృష్టించిన భయం, భ్రమలను ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయన్నారు. రైతులు, యువత, కూలీలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు సహా దేశంలోని ప్రతీ వర్గం.. నియంతృత్వాన్ని రూపుమాపి న్యాయపాలనను నెలకొల్పాలని కోరుకుంటున్నారని తెలిపారు. తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజలు ఇండియా కూటమి పక్షాన ఉన్నారని రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందిస్తూ.. దేశంలో మారుతున్న రాజకీయ వాతావరణానికి ఈ ఫలితాలు సంకేతమన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ చేసిన అన్ని కుట్రలనూ ఓటర్లు తిప్పికొట్టారని చెప్పారు.

Updated Date - Jul 14 , 2024 | 02:47 AM