Share News

Hyderabad: పుంజుకునేందుకు కేసీఆర్‌కు అవకాశాలున్నాయి..

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:55 AM

‘‘కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి తన ఉనికిని నిరూపించుకోవాలి. అప్పుడు ఆయన మళ్లీ పుంజుకునేందుకు అవకాశాలు లేకపోలేదు. కానీ, కేసీఆర్‌ ఇప్పుడు హరీశ్‌ రావు ట్రాప్‌లో ఉన్నారు. కేసీఆర్‌ బతికున్నంత వరకూ హరీశ్‌ ఆయనను ఏమీ చేయలేరు.

Hyderabad:  పుంజుకునేందుకు కేసీఆర్‌కు అవకాశాలున్నాయి..

  • అసెంబ్లీకి వచ్చి ఆయన తనఉనికిని నిరూపించుకోవాలి

  • జగన్‌ వైసీపీనే ఖతం చేసుకున్నాడుఢిల్లీలో మీడియాతో

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిచిట్‌చాట్‌ పుంజుకునేందుకు

  • మన పగ తీర్చుకోవడానికి ప్రజలు అధికారం ఇవ్వరు

  • కక్ష సాధింపు చర్యల కారణంగానే జగన్‌కు గుణపాఠం చెప్పారు

  • జగన్‌ ఇంటి వద్ద కూల్చివేతలకు, చంద్రబాబుకు సంబంధం లేదు

  • బాబు అలాంటి చిల్లర పనులు చేయలేదు.. అలా దిగజారలేదు

  • ఓ మంత్రి పట్టుబట్టి.. అధికారులకు చివాట్లు పెట్టి చేయించారు

  • విలేకరులతో సీఎం రేవంత్‌ చిట్‌చాట్‌

న్యూఢిల్లీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి తన ఉనికిని నిరూపించుకోవాలి. అప్పుడు ఆయన మళ్లీ పుంజుకునేందుకు అవకాశాలు లేకపోలేదు. కానీ, కేసీఆర్‌ ఇప్పుడు హరీశ్‌ రావు ట్రాప్‌లో ఉన్నారు. కేసీఆర్‌ బతికున్నంత వరకూ హరీశ్‌ ఆయనను ఏమీ చేయలేరు. కేసీఆర్‌ పూర్తిగా బలహీనమయ్యాక పార్టీని అఽధీనంలోకి తీసుకుంటారు. లేదా కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మీ వల్లే కేసీఆర్‌ తమకు గౌరవం ఇస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, వెళ్లగానే లేచి దండం కూడా పెడుతున్నారని చెప్పారని వివరించారు. గత వైఖరికి భిన్నంగా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించాల్సి వస్తున్న తీరుతో కేసీఆర్‌ మానసిక క్షోభతో బాధ పడుతున్నారని, జైలుకెళ్లినా కేసీఆర్‌కు అంత బాధ ఉండేది కాదని వ్యాఖ్యానించారు.


ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేల చేరికలు అవసరమని, ఉన్న ప్రభుత్వమే పోతే చేసేదేమీ ఉండదని చెప్పారు. ఢిల్లీలోని తన నివాసంలో సీఎం రేవంత్‌ గురువారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మనం పగ తీర్చుకోవడానికి అధికారాన్ని ప్రజలు ఇవ్వరని, మన కోపం తీర్చుకోవడానికి అధికారాన్ని ఉపయోగించుకోకూడదని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి రేవంత్‌ విమర్శల బాణాలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఇతర రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలతో వ్యవహరించి, పాలనను విస్మరించినందువల్ల జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. టీడీపీని ఖతం చేయాలని పగబట్టి ఆ పార్టీని ఏమీ చేయకుండా చివరకు తన పార్టీనే ఖతం చేసుకున్నాడని వ్యాఖ్యానించారు.


మనం చేసిన పాపాలు మనల్ని ఏదో ఒకనాడు మింగుతాయని చెప్పడానికి జగన్‌ తుడిచిపెట్టుకుపోయిన ఉదంతమే ఉదాహరణ అని అన్నారు. అంతకు మించిన శిక్ష జగన్‌కు మరేమీ లేదని చెప్పారు. జగన్‌పై నమ్మకంతో ప్రజలు 150కుపైగా సీట్లు ఇచ్చారని, కానీ, అతడు తప్పు చేయడంతో గద్దె దించారని గుర్తు చేశారు. రెండు పార్టీల పంచాయితీ ప్రజల పంచాయితీ కాదన్నారు. జగన్‌ వ్యవహార శైలే ఆయనను దెబ్బతీసిందని, తన వద్దకు వచ్చిన వైసీపీ ఎంపీలను ఆయన తిట్టి పంపించారని, వారే ఇతర పార్టీల్లో చేరి గెలిచి వచ్చారని గుర్తు చేశారు. జగన్‌ చేసిన అక్రమాలతో పరిశ్రమలు కుప్పకూలాయని, రాష్ట్రం దెబ్బతిందని గుర్తు చేశారు.


దిగజారడం బాబు వ్యక్తిత్వం కాదు

‘‘చంద్రబాబు ఫోన్‌ చేస్తే హైదరాబాద్‌లోని జగన్‌ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించానన్న విమర్శల్లో వాస్తవం లేదు. చంద్రబాబుది నాకు ఫోన్‌ చేసే స్థాయి కాదు. ఆయన తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయలేదు. అలా దిగజారడం ఆయన వ్యక్తిత్వం కాదు’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక మంత్రి పట్టుబట్టి, అధికారులకు చివాట్లు పెట్టి జగన్‌ ఇంటి వద్ద కట్టడాల్ని కూల్చి వేయించారని, ఆ మంత్రికి సుబ్బారెడ్డి 50 సార్లు ఫోన్‌ చేసి ఆపించే ప్రయత్నం చేశారని, ఖమ్మానికి చెందిన ఒక మంత్రిద్వారా కూడా రాయబారం నడిపారని వివరించారు. జగన్‌ ఇంటి వద్ద కూల్చివేతల విషయం తనకు దృష్టికి వచ్చిన వెంటనే సదరు అధికారిని జీఏడీకి అటాచ్‌ చేశానని గుర్తు చేశారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత సంబంధాలున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు, తన రాజకీయ భవిష్యత్తు తనకు ముఖ్యమని రేవంత్‌ తెలిపారు.


మూడు రాజకీయ లక్ష్యాలూ నెరవేరాయి

రాష్ట్రంలో కూడా కేసీఆర్‌ తన అహంకారం, అతి తెలివితేటల వల్ల దెబ్బతిన్నారని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి కావడం, బీఆర్‌ఎస్‌ ఓటమి, కేసీఆర్‌ను గద్దెదించడమనే తన మూడు రాజకీయ లక్ష్యాలూ నెరవేరాయని వివరించారు. ‘‘తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా తమ ఓటును బీజేపీకి మళ్లించినందువల్లే కాంగ్రె్‌సకు సీట్లు తగ్గాయి. బీజేపీ గెలిచిన చోట్లల్లా బీఆర్‌ఎస్‌ డిపాజిట్లు కోల్పోయింది. డబ్బులు పంచి మరీ ఆ పార్టీ బీజేపీకి ఓటు వేయించింది. కాంగ్రె్‌సను ఓడించాలన్న కసితో వాళ్ల ఓట్లు కూడా వాళ్లు వేసుకోలేదు’’ అని వివరించారు. కేసీఆర్‌ ఒక్క సీటు కూడా గెలవడని తాను ముందే చెప్పానని రేవంత్‌ గుర్తు చేశారు. అనుకున్నట్లుగా కాంగ్రె్‌సకు 12 సీట్లు రాకపోయినా బీఆర్‌ఎస్‌ శాశ్వతంగా మరణించిందని చెప్పారు. లోక్‌సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా చేశానన్నారు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ పనిచేస్తే ఈసారి కేసీఆర్‌ వ్యతిరేక గాలి పని చేసిందని, కేసీఆర్‌నియంతృత్వ పాలనపై తాను చేసిన పోరులో ప్రజలు భాగమయ్యారని వివరించారు.


రాహుల్‌ను ఒప్పించింది నేనే

రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో తానే తొలుత మాట్లాడానని, సిద్దరామయ్య బలపరిచేలా చేశానని సీఎం రేవంత్‌ చెప్పారు. ఈ మేరకు వర్కింగ్‌ కమిటీ తీర్మానం చేసిందని, అందుకే పదవి పట్ల విముఖంగా ఉన్న రాహుల్‌ కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు దాటవని తొలుత చెప్పిందీ తానేనన్నారు. తెలంగాణలో కాంగ్రె్‌సకు బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పలేమని, స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ బలమేందో తెలుస్తుందని అన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ కట్టిన తర్వాత మెయింటినెన్స్‌ను స్టార్‌ హోటల్‌కు అప్పగిస్తామని, అప్పుడు రాష్ట్రానికి కావాల్సిన రూములు, ఆహారం కోసం ఒప్పందం చేసుకుంటామని, అప్పుడే నాణ్యమైన వసతి సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు.


ఎంతమందిని తీసేస్తాం!?

తాను పాలనను విస్మరించి తప్పులు చేసిన అధికారులపైనే దృష్టి సారిస్తే వ్యవస్థలు పని చేయవని, అప్పుడు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవని, కంపెనీలు దెబ్బతింటాయని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎంతమందిని తీసేస్తామని అన్నారు. ‘‘అవినీతిని మితిమీరకుండా చూసుకోవాలి. సామాన్యుడు నష్టపోకూడదు. నేను అధికారంలోకి వచ్చాక ఏసీబీ, విజిలెన్స్‌ క్రియాశీలంగా పని చేస్తున్నాయి. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డులతో సహా 86 మందిని బదిలీ చేశాం. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కలెక్టర్లు, అధికారులను బదిలీ చేశాం. ఒక ఎస్పీ స్థాయి అధికారిణి తన కుటుంబ సభ్యులతో పత్తాలాటలను ప్రోత్సహించింది. సదరు అధికారిణికి పక్క రాష్ట్రానికి చెందిన కీలక నేత కుటుంబంతో బంధుత్వం ఉన్నా ఖాతరు చేయలేదు. ఒక ఐఏఎస్‌ అధికారిణి భర్త అక్రమాలకు పాల్పడితే గంటలలోనే ఆమెకు సమాధుల బాధ్యతలు అప్పజెప్పాను’’ అని వివరించారు. రాష్ట్రంలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించే వరకూ వెనకాడబోనని, అమ్మాయిలు, అబ్బాయిలు అన్నా తేడా లేకుండా యువత మత్తులో దిగి జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jun 28 , 2024 | 03:55 AM