TS Politics: ఒక రహస్య ఎజెండాగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వెళ్తున్నాయి.. కాంగ్రెస్ నేత మల్లు రవి హాట్ కామెంట్స్
ABN , Publish Date - Feb 16 , 2024 | 08:25 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేదని ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) ప్రశ్నించారు.
ఢిల్లీ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేదని ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి (Mallu Ravi) ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాళేశ్వరంపై ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడితే తిరిగి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారని.. సగం నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకముందే రూ. 22 వేల కోట్లు కాళేశ్వరానికి కేటాయించారని తెలిపారు. హారీష్ రావు, కేటీఆర్ మాటలు రాష్ట ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. యాదవులకు గొర్రెలు సరఫరా చేస్తామని కోట్లలో లెక్కలు చూపించారని ఆరోపించారు. గొర్రెలను తరలించామని ఇష్టానుసారంగా లెక్కలు రాశారన్నారు. అందుకు సంబంధించిన ఫైల్స్ కాల్చేశారని.. కాగ్ రిపోర్ట్ చూస్తే తెలుస్తుందని.. ఇప్పుడు ఎందుకు ఆ ఫైల్స్ కాల్చారో చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ నేతలను ఎంత రెచ్చగొట్టిన తమ నేతలు రెచ్చిపోరని చెప్పారు. ఇప్పటికే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్‌లకు ప్రజలు శిక్ష వేశారని చెప్పారు. వారు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతల వైఖరి ఈ విధంగానే ఉంటే లోక్‌సభలో రెండు మూడు సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అవుతాయని చెప్పామన్నారు. ఒక రహస్య ఎజెండాగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వెళ్తున్నాయని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సీట్లలో బీఆర్ఎస్, బీజేపీ ఫ్రెండ్లీ అండర్ స్టాడింగ్‌తో పోటీ చేశాయని వివరించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తుందన్నారు. అన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో బీఆర్ఎస్‌కు కాళేశ్వరం ఏటీఎం మిషన్‌గా తయారైందని చెప్పారని.. మరి చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. గతంలో బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామనలేదా అని ప్రశ్నించారు. గతంలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారని.. అప్పుడు ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. ఇప్పుడు బీజేపీ సీబీఐ విచారణ అడిగి ఎలాంటి అవినీతి జరగలేదని బీఆర్ఎస్‌ను రక్షించడానికి కుట్రలు పన్నుతోందని మల్లురవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.