Kishan Reddy: హనుమాన్ సినిమాపై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 08 , 2024 | 10:14 PM
హనుమాన్ సినిమా ( Hanuman movie ) వాళ్లు ప్రతి టికెట్ పై 5 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని.. ఇదే స్ఫూర్తితో మరికొంత మంది ముందుకు రావాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) పిలుపునిచ్చారు.
హైదరాబాద్: హనుమాన్ సినిమా ( Hanuman movie ) వాళ్లు ప్రతి టికెట్ పై 5 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని.. ఇదే స్ఫూర్తితో మరికొంత మంది ముందుకు రావాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) పిలుపునిచ్చారు. సోమవారం నాడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయోధ్యలో రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్టకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అన్ని దేవాలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ నెల 22వ తేదీన ప్రతీ ఇంటా రామజ్యోతులు వెలిగించాలి. రామాలయం ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. NTPC 800 మెగావాట్ల ప్లాంట్ ఓపెనింగ్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాలల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.
మరో రెండు రోజుల్లో పార్లమెంట్ కన్వీనర్లను నియమిస్తాం
కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ ( BRS ), బీజేపీ ఎక్కడ ఒకటి..? ఎప్పుడైనా BRS తో మేము కలిశామా..? పార్లమెంట్ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడంపై చర్చించాం. పార్టీ శాసన సభ్యులను పార్లమెంట్ ఇన్‌చార్జీలుగా నియమించాం. మరో రెండు రోజుల్లో పార్లమెంట్ కన్వీనర్లను నియమిస్తాం. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో సంక్రాంతి తర్వాత ప్రచారం ప్రారంభిస్తాం. మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలవనుంది. కాంగ్రెస్, బీజేపీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ ( BRS ), కేసీఆర్ అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. ఎన్నికలల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.