Share News

MLA Harish Rao: మిమ్మల్ని గెలిపించింది స్కూళ్లు మూత వేయించడానికా?: ఎమ్మెల్యే హరీశ్ రావు

ABN , Publish Date - Aug 27 , 2024 | 10:49 AM

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చదువుకు నోచుకోని పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో గిరిజన బిడ్డలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేరన్న సాకు చూపి 43 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం కాంగ్రెస్ చేతకాని పాలనకు నిదర్శనమంటూ ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

MLA Harish Rao: మిమ్మల్ని గెలిపించింది స్కూళ్లు మూత వేయించడానికా?: ఎమ్మెల్యే హరీశ్ రావు
MLA Harish Rao

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ముఖ్యంగా విద్యా, వైద్యం, తాగునీరు, రైతు రుణమాఫీ విషయాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు (Government Schools) మూసివేశారని, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ హరీశ్ రావు ఎక్స్(ట్విటర్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఉపాధ్యాయులు లేరని మూసివేస్తారా?

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చదువుకు నోచుకోని పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో గిరిజన బిడ్డలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేరన్న సాకు చూపి 43 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం కాంగ్రెస్ చేతకాని పాలనకు నిదర్శనమంటూ ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఉపాధ్యాయులు లేక సూళ్లు మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని రాసుకొచ్చారు. ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజనులు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమంటూ ధ్వజమెత్తారు.


ప్రజలు మిమ్మల్ని పాఠశాలలు మూసివేయడానికి గెలిపించారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని మూతపడ్డ 43 పాఠశాలలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. టీచర్ల నియామకం జరిగే వరకూ విద్యా వాలంటీర్లను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు లేరన్న కారణంతో రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలా మూతపడకుండా చూడాలని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల సమస్యలకు పరిష్కారం చూపాలంటూ ఎక్స్ వేదికగా హరీశ్ రావు డిమాండ్ చేశారు.


కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు..

తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో మళ్లీ తాగునీటి కష్టాలు మెుదలయ్యాయంటూ మాజీ మంత్రి హరీశ్ రావు మరో ట్వీట్ చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మేడికుందా తండాలో 15రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహించారు. కాలి నడకన వెళ్లి నీటి కుంటల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తెచ్చుకున్న కలుషిత నీరు తాగి విషజ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యం తగదని, వెంటనే మరమ్మతులు చేసి గ్రామస్థులకు తాగునీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Trains: 30 నుంచి పలు రైళ్ల వేళల్లో మార్పులు..

Breaking News: నేటి తాజా వార్తలు..

Updated Date - Aug 27 , 2024 | 10:51 AM