Hyderabad: బడ్జెటేతర అప్పుల్లో తెలంగాణదే అగ్రస్థానం!
ABN , Publish Date - Jun 18 , 2024 | 03:20 AM
దేశంలో కొన్ని రాష్ట్రాలు బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా అప్పులు చేస్తున్నాయని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ (ఎన్‌ఐపీఎ్‌ఫపీ)’ తెలిపింది. ఇలాంటి అప్పులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు గ్యారెంటీ కూడా ఇస్తున్నాయని వెల్లడించింది.
ఇలాంటి రుణాలకు ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తున్నాయ్
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు అప్పులమయం
అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్
ఏపీ, పంజాబ్‌లలో ఆదాయాన్ని మించి వ్యయం
ఎన్‌ఐపీఎఫ్‌పీ పత్రంలో వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): దేశంలో కొన్ని రాష్ట్రాలు బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా అప్పులు చేస్తున్నాయని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ (ఎన్‌ఐపీఎ్‌ఫపీ)’ తెలిపింది. ఇలాంటి అప్పులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు గ్యారెంటీ కూడా ఇస్తున్నాయని వెల్లడించింది. ‘ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం)’కు అవసరమైన ప్రభుత్వ పత్రాల్లో ఈ అప్పుల ప్రస్తావన ఎక్కడా ఉండదని ఎన్‌ఐపీఎ్‌ఫపీ విడుదల చేసిన పత్రంలో వివరించింది. 2021 మార్చి 31 నాటికి అన్ని రాష్ట్రాల బడ్జెటేతర అప్పులు కలిపి రూ.2,52,308 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఇలాంటి అప్పులున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలోను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఉన్నాయని వెల్లడించింది.
ప్రభుత్వ లెక్కల్లో ప్రస్తావన లేకుండా అదనంగా అప్పులు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు ప్రమాదకరంగా మారతాయని ఎన్‌ఐపీఎ్‌ఫపీ హెచ్చరించింది. ఇక ఈ లోపాయికారీ అప్పుల గురించి ప్రజలకు చెప్పకుండా తమకే వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరిందని, ఇది ఆర్థిక జవాబుదారీ విధానానికి, పారదర్శకతకు విరుద్ధమని పేర్కొంది. దేశంలో అప్పుల కుప్పగా మారిన 13 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని, ఆ రాష్ట్ర మొత్తం అప్పులు 2021లో జీఎ్‌సడీపీలో 36.9 శాతం, 2024 నాటికి 33.5 శాతంగా ఉన్నట్లు వివరించింది.
ఏపీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆదాయం కంటే వ్యయం భారీగా పెరిగిపోవడంతో నగదు అందుబాటులో లేక, సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. నగదు అందుబాటులో లేకపోవడం వల్ల ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. మార్కెట్ రుణాలపై ఏపీ ఎక్కువగా ఆధారపడుతోందని తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది.